తెలంగాణం గెలిచింది..

Posted on July 30, 2010 by allam.
Categories: allam, chaitanya allam, Telangana Pata.

తెలంగాణం గెలిచింది..
అడుగడుగునా ప్రభంజనం లేపింది..
మంచిర్యాల మిల మిల మెరిసిపొయింది..
చెన్నూరు చేయూతనిచ్చింది..
సిద్దిపేట సింహమై గర్జించింది..
ఓరుగల్లు పారే పోరుగల్లై పోటెత్తింది…
సిర్పూర్ సింహ స్వప్నమై నిలిచింది…
నిజామాబాద్ నిజాన్ని నిరూపించింది..
ధర్మపురి ధర్మాన్ని నిలబెట్టింది..
ఎల్లారెడ్డి ఎల్లువై ఎలిగిపొయింది..
కోరుట్ల కోటి కాంతులని వెదజల్లింది..
హుజూరాబాద్ హంసధ్వని పాడింది..
వేములవాడ విరిజల్లై విరబూసింది..
సిరిసిల్ల సిరిగల్లదై సీకట్ల పారదోలింది…
ప్రాథమిక ప్రజా హక్కు పారిజాతమయ్యింది..
పచ్చని వోటు వజ్రాయుధమయ్యింది..
పాట పొలికేకయ్యింది..
దొంగాట ఆగమయ్యింది..
పంచిన పచ్చ నోటు ప్రభావం లేక వెలవెలపోయింది. .
పారిన మందు పారినట్టె నేలపాలయ్యింది..
నయవంచకుల జీవితాన దుగ్ద గీతాన్ని ఆలపించింది..
అక్రమాల విక్రమార్కుల తల వేయి ముక్కలైపోయింది..
కుట్ర కుతంత్రం భళ్ళున పగిలిపోయింది..
మల్ హర్ రావు, స్వేత, చాకలి స్రీనివాస్, 
సత్యనారయణరెడ్డిల ఆత్మ త్యాగాలు వృధా కాలేదు..
ఎందరో అమరవీరుల త్యాగం స్వప్న గీతమై విరాజిల్లింది..
ప్రజా తీర్పు ప్రజాస్వామ్యమై పరిమళించింది..
త్యాగధనుల విజయ కేతనాలు పరవశమయినాయి..
తలెత్తుకుని తెలంగానోడు, హత్తుకుని ఆదరించిండు..
త్యాగానికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నడు…
చిరకాల స్వప్నమేదో సాకారమయినట్టు…
సీకటంత చిటుక్కున మాయమయినట్టు…..
లోకమంత రంగులమయినట్టు…..
తెలంగానం ఉరుమై..మెరుపై…
దిక్కు దిక్కున ప్రతిధ్వనించింది….
ఊరువాడన మారుమోగింది..
ఎలుగెత్తి చాటి చెప్పింది..
పోటెత్తి ప్రవహించింది…
జై కొట్టి గెలిపించింది…
జై తెలంగాణ…
జై జై తెలంగాణ.. 

–కృష్ణ చైతన్య అల్లం

Archives

పల్లెటూరి పిలగాడు..

 

మసి బొగ్గుల మీద కాగుతున్న వేడి నీల్లు..
గొట్టంతో రగిలించు మంటకు పల్లె పడుచు కంట్లొ కన్నీల్లు..
లోకంతో పనిలేని ఎగిసిపడె నిప్పురవ్వలు..
పొగసూరిన పొయ్యి వైపు బీరిపొయిన సూపులు…
యేనాటిదో ఒక యాది..
అద్దన్నా అనుకోకుండ మతికస్తాంది..
రేగు పల్ల చెట్టు నేడు మొదలు లేని మాడు
కొమ్మ మీద జీవం కానరాని ఒంటరి పక్షి గూడు
ఆనాటి పరికి పల్ల పొదలు..
నేడు తుమ్మ చెట్ల సమూహాలు..
ఎండబెట్టుకు తిన్న బలిశి కాయలు
మోటబాయిల దునికి తేలె ఈతగాల్లు..
ఈతశెట్లకు గౌన్లోల్లు కట్టిన కుండల్ల తెల్ల కల్లు..
మోటబాయి మోతలు యేడ ఆగినయ్యో..
తాడిశెట్ల మొదాల్లు యేడ మాయమయినయ్యో..
ఎర్రటెండల మంచె కింద నవారు మంచం..
మాపటేల కునుకు తోడు రెల్లు పూల వాసన కొంచెం..
ఆడి పాడి అలిసిన పెయ్యికి నీడల గింత నిమ్మలం..
మూశిన కండ్లల్ల ఎదో పగటి కలల కలవరం.. 
ఇంతల బర్రెల కాశె పోరని గాయ్ కేక..
పొద్దుగూకిందని గుర్తు చేస్కుంట దోమల రాక..
చేన్ల పానం లేని దిష్టి బొమ్మ పొద్దంత పిట్టల కాపలా కాశింది….
చీకటి పడేటాల్లకు పనిలేక పాపం ఒంటిదైపెయింది… 
మల్లత్తతీమ్మని చెప్పి ఉరికి ఇంటికచ్చిన యాది..
దారి పొంట విసిలు పురుగుల ఈలలు..
మినుకు మినుకుమని కరెంటు పురుగుల వెలుగులు…
కాళ్ళ కింద పచ్చిగ తాకుతున్న గడ్డి స్పర్షల ఏదో అనుభూతి..
ఉరికచ్చే ఉత్సాహానికి ఎగిరి దునికినప్పుడు చేతికచ్చే చింత చిగురు..
తియ్యగ లేనే లేదు, పులుపు కొంచెం వగరు..
కరెంటు కంబాలు.. ఆ బుగ్గల సుట్టూ గమ్మత్గ పురుగుల తిరుగుడు..
ఇండ్ల ముంగట ఆకిలి కాడ ముసలోల్ల ముచ్చట్లు షురు.. 
బురదకాల్ల సూషి అవ్వ మొత్తుకుంటది..
నీ దినాల్ గాను పొయి కాల్లు కడ్కరాపో.. 
ఇంటెనకాల చేదుడు బాయిల బొక్కెనేశి తోడుకున్న సల్లటి నీల్లు..
రాకి రాకి కడుక్కున్న బురద కాళ్ళకు సింతాలు సోపు వాసన..
ఇంట్లకచ్చి గాయింత దానికే,
మాదండి గనకార్యం చేసినట్టు..
"సూషినవా…"
"కాల్లు ఫ్రెశ్షు.."
"ఇగ సాల్తీ.. ఇంత తిని జప్పన పండుకో నాయ్నా"
లోపల నవ్వుకుంట కసురుకునే మాయవ్వ…
నల్బై వాట్ల బుగ్గ కింద ఈగల్ని తోల్కుంట
వేడన్నంల గింత పప్పు, గింత చింతకాయ తొక్కు..
తిన్న నాలుగు ముద్దలు ఎంత రుచి..
నీ యవ్వ బగమంతుని జలమ ఎందుకు అక్కరుకే రాదు..
మనసుల గా తిండి తినలేకపొయిన బగమంతుని మీద పిసరంత జాలి..
రాగి శెంబుల తాగే గా పల్లె నీళ్ళు ఇగ అమృతమే..
సావిట్ల నులక మంచం మీద పరుసుకున్న పాత జంపఖాన..  
సందమామ కింద సుక్కలు లెక్కపెట్టుకుంట..
సల్లని గాలి పెయ్యి తాకుతుంటె..
పల్లెటూరి పోరని జీవితానికి ఉన్నదేంది..
ఏ సీ రూంల పరుపు మీద
ఎల్ సీ డీ టీ.వీ. ముందరేసుకుని చేతిల నలిగే రిమోటు వెనకాల
మాయమయిందేంటిది..
సమాధానం లేని ప్రష్న..
మనసుని అడుగుదామంటె దానికే మనస్షాంతి లేదు..
బగమంతుడా…
హాం ఫట్ అని తెల్లారి గా నులక మంచంల నన్ను లేపు..

 

-కృష్ణ చైతన్య అల్లం