మా తాత తెచ్చే ఉసిరికాయలు ఎక్కడ ?
Posted on | May 24, 2011 | 2 Comments
- జయప్రకాశ్ తెలంగాణ
లేబర్ కాలనీ అమమ్మ వాల్ల ఇంట్ల నుంచి ఖాలీ చేసి పిన్నవారి వీధిల ఉండబట్టి ఒక ఆరు నెల్లు అయిందేమో ! ఆదివారం వచ్చిందంటె సాలు రికాము లేకుంట అడిగేది మమ్మిని “లేబర్ కాలనీ అమమ్మ వాల్ల ఇంటికి పోతనే” అని. సొంత అమమ్మ కాక పోయినా, అమమ్మకు పెద్దమ్మ బిడ్డ, లేబర్ కాలనీల ఉంటది కాబట్టి ఆ పేరు తోటి ప్రేమగ పిలిసుకునేది. మరి లేబర్ కాలనీకి ఆ పేరెందుకొచ్చింది? మిల్లుల పని చేసెటోల్లందరు ఆడ ఉంటరు కాబట్టి ఆ పేరు వచ్చిందేమో ! ఇంతకి లేబర్ కాలనీ అమమ్మ అసలు పేరు చెప్పలే కదా వీరమ్మ! తాత పేరు కనకయ్య!
గాంధీ తాత మిల్లుగ్రౌండుకు వచ్చినప్పుడు అమమ్మకు పెల్లైందని చాన పెద్దగైనంక గాని తెల్వలే నాకు. రజాకార్లు చింతల్ కి వచ్చినప్పుడు ఇర్వై- ఇర్వై మూడేల్లుండెనట అమమ్మకు. తాత మొదట్నుంచి మిల్లులనే పని జేసేది, సాంచల్లు రెపైర్లు జేసేదంట. నేను పుట్టినప్పటి నుంచి వాల్ల ఇంట్లనే కిరాయికి ఉన్నం మేము ఓ నాలుగు ఐదేళ్ళు, నాకు సొంత అమమ్మ కంటె ఎక్కువ ఇష్టమైతుండె లేబర్ కాలనీ అమమ్మ. రోజు రాత్రి నా ఆస్మాన్ రంగు మెత్త తీస్కొని పోయి, అమమ్మ నవార్ మంచాంన్ని కడ్పలేసుకొని పండుకునేది, నిద్రపట్టేదాంక ఈపు గోకిచ్చుకునేది. ఎప్పుడన్న అర్ధరాత్రి తెలివి బడితె మెత్తను సంకల పెట్టుకొని నడుసుకుంట పొయ్యి డాడి దెగ్గర పండుకొనేదని అందరు ఏడిపిచ్చేటోల్లు.
నేను లేబర్ కాలనీ అమమ్మను రోజు యాది జేసుకునుడు చూసి మమ్మి బతిలాడంగ, ఒక రోజు ఆదివారం పొద్దున్నే తయారు జేసుకొని, ఊరికి పోవుకుంట నన్ను దార్ల లేబర్ కాలనీల దింపి పోయిండు డాడి. పోయేసరికి అరుగు మీద కూసొని ఎల్లిపాయలు దీసుకుంటున్నది అమమ్మ, నన్ను సూశేసరికి పానం లేశొచ్చినట్టై చాట పక్కకు పడేసి కావలించుకున్నది. నేను వచ్చిన అని పక్కింటి మల్లేశం తోటి తాతకు మతులాబు పంపింది. “పొద్దుటి పైలికి పోయిండు ఇంకో గంటకు వస్తడు తాత మనం ఇంటెనుకకు పోదాం పా” అని తోసుకపోయింది.
ఇంటెనుకకు పోయేసరికి ఏదో ఎలితి అనిపిచ్చింది, బాయికి ఆనుకున్న గోడెంబడి ఉన్న చింత చెట్టు మాయం అయింది. మొత్తం మూడు చింత చెట్లు ఉంటుండె, మేము ఉన్నప్పుడే ఓ రెండు కొట్టేశింరు, ఇప్పుడు మిగిలింది గూడ పోయింది. ఎండ కాలం వస్తె ఆ చింత చెట్ల కిందనే పండుకునేది. చింత కాయలు కొట్టుకొని, చిగురు తెంపుకొని, జామాకుల చింతపండు తోటి కలిపి పెట్టుకొని పాన్ ఏసుకునేది పోరల్లమంత. దానిమ్మ పండ్లు, పరికి పండ్లంతుండే టమాటసొంటి పండ్లు ఏమి లేకపోతె ఇంకో మూలకున్నయాప పండ్లే దిక్కు. చింత చెట్లు తప్ప అన్ని ఉన్నయి హమ్మయ్య అనుకున్నా. చిల్కలు కొడుతయని అమమ్మ దానిమ్మ కాయలకు, జామకాయలకు గుడ్డ పేల్కలు గట్టేది, వాటిని ముట్టుకుంటె మాత్రం ఈపు యిమానం మోతమోగేది.
“అమమ్మా జాంకాయలు ఉన్నయానే, గుడ్డపేల్కలు కనిపిస్తలేవు చెట్ల మీద?”
“ఏడ రా! పేల్కలు ఎత్తుకొని తిన బట్టె చిలుకల, గా అవుతలి చెట్టుకు మొన్న కొన్ని పిందెలు కానొచ్చినయి సూద్దాం పా!” అనుకుంట బాయి పక్కెంబడి ఉన్న బొంగు తీస్కొని చెట్టు కిందికి బోయి, కండ్లకు చెయ్యి అడ్డం బెట్టుకొని సూడ వట్టింది.
“అమమ్మా! పైన కొమ్మకున్నదే దోర పండు” అమమ్మకు పండు కనబడక ముందే నేను చెట్టు ఎక్కి తెంపుకున్న.
“అరే! పైలం రా వారీ, దెబ్బ తలిగిచ్చుకుంటె మీ అయ్యకు నేను ఏం జెప్పుకోవాలె?” అనుకుంట పిర్ర మీద ఒకటి సరిశింది. “కడుక్కోని తినురా” అనేలోపే నేను రెండూ మూడు బుక్కలు కొరికేశిన, మిగిలిన కాయ తినుకుంట మూలకు నిలబెట్టి ఉన్న కట్టెల దిక్కు బోయిన, చిన్నప్పుడు పాములుంటయని ఇటుపంటి రావలంటె భయమయ్యేది.
“అరే! పైలం రా గుంజలు మీద బడుతయి”
“అమమ్మా? తాతకు ఉశిరికాయలు తెమ్మని జెప్పినవానే?”
నవ్వి “ఇంతకు మునుపు మల్లేశం పోయెటప్పుడు చెప్పిన తియ్యిరా తెమ్మని?
… ఇంకా మరువలేదారా ఉశిరికాయలను?”
ఎట్ల మరుస్త! వచ్చిందే వాటికోసమాయె! రోజు మూడు గంట్లకు సైరన్ ఇనబడంగనే సాలు పోయి అరుగు మీద కూసొని మేయిన్ రోడ్ మీద మలుపు తిరిగే సైకిల్ల దిక్కు సూసుకుంట కూసునేది. మిల్లు క్యాంటీన్ అవుతల చిన్నఉశిరికాయల చెట్టు ఉండేది. రోజు తాత డూటీ దిగంగనే కింద పడ్డ పండ్లన్నీ ఏరి దస్తీల మూట గట్టుకొని తెచ్చి అరుగు మీద పరిశి …
“గుడ్లగూబ కండ్లేసుకొని ఎట్ల సూస్తుండు సూడు” అని పరాశికం ఆడుకుంట దెగ్గరికి తీసుకునేటోడు.
“ఇంకెప్పుడొస్తడే తాత?”
“జర్రాగురా బిడ్డ ఒస్తడుగని”
“ప్రసాదముల్లా! ప్రసాదం!” అని అరుపు ఇనవడ్డది
“ఇగ వో! మీ అత్త ప్రసాదం పెడుతాంది” అంటుండంగనే ఇంటెనుక దర్వాజ తీసుకొని ఆనంగ ఉరికిన.
మా మేనత్త. రోజు పూజ అయిపోంగనే, అర్టి పండు, కుడుక ముక్కలల్ల శెక్కరేశి, ప్రసాదం పంచేది. అప్పటిదాంక వాడంత ఖాలీగ కనబడేది, ‘ప్రసాదం’ అని ఇనంగనే ఈగల లెక్క ముసిరేది వాడ మీది పోరగాల్లంత. ఈ సారి ప్రసాదం ఒడువక ముందే అందరి కన్న ముందు బోయి లైన్ల నిలబడ్డ. చేతుల బెట్టిన ప్రసాదం తిన్నంక ఇంకొంచం అడిగిన. ఎవలో వాడ మీద పిలగాడని ముందు కోపంగ సూశినా, ఎంబడే ఏర్పాటు జేసి ”ఎప్పుడస్తివిరా జయా!” అనుకుంట చెంపల మీద ఓ వంద ముద్దులు పెట్టినట్టుంది. ప్రసాదం పంచుడు అయిపోయినంక తాంబాలం కడిగి, లోపలికి పోయి హార్లిక్స్ కలుపుకొచ్చింది. అత్తోల్ల ఇంట్ల తప్ప నాకు ఏడ హార్లిక్స్ తాగనీకి లేక పోతుండె. ఇంటి ముందట మామ కూసునే ఆరాం కుర్సీ ఖాలిగ కనబడితె దాంట్ల కొసొని, ఇంటి ముందట ఉన్న జాజి పూల పందిరి దిక్కు సూసుకుంట, ఉడుకు పాలు సాసర్ పోసుకొని తాగుతున్న.
రాజ్‌దూత్ ఇంటి ముందట ఉన్నదంటె? మామయ్య ఇంట్లనే ఉన్నడన్న మాట! అనుకొని కప్పు వంట రూంల పడేసి మెల్లగ బైటికి వచ్చి పందిరి కింద ఆడుకుంట, మా బావ అంబి కోసం దేవులాడుతుంటె తాత సైకిల్ కనబడి రయ్యిన ఏనుక బడి ఉరికిన.
* * *
ఉరుక్కుంట మూల తిరుగుతుంటె దబ్బున ఏదో తాకి కింద బడ్డ, ఎంబడే లేశి దులుపుకోని తాత దిక్కు ఉరికిన. స్టాండు సరిగ్గ పడక సైకిల్ కింద పడ్డది, కోపంతోటి లేపి మల్ల స్టాండు ఏస్తుంటె ఎనుక నుంచి పొయ్యి తాతను గట్టిగ పట్టుకున్న. కోపంతోటి తాత గట్టిగ నూకితె పొయ్యి అంత దూరంల పడ్డ. అది సూశి అమమ్మ ఇంట్ల నుంచి ఉరికొచ్చి
“పిలగాడు ఎండలబడి వస్తె గట్ల తంతివేందే వాన్ని” అన్నది
“ఒక దిక్కు నౌకరి పోయి నేను ఏడుస్తుంటె పండ్లు గావాల్నానే వీనికి..” అనుకుంట ఇంటెనుకకు పొయ్యి ఇత్తడి చెంబుల నీల్లు కాల్ల మీద పోస్కొని గోడకు ఇస్సిరి కొట్టిండు.
“అయ్యో పొలగానికి నెత్తురు కారుతాంది గాదే” అని అమమ్మ అనంగనే ఇంటి ముందటికి ఉరికచ్చి ఇంటి మూల మీది బోరింగ్ దిక్కు సూశిండు. బోరింగు హాండిల్ మీది నుంచి రక్తం కారుతుంటె సూశి
“ఈ హౌల గాల్లకు ఎంత జెప్పినా గాని పంపు కొట్టుకున్నంక హాండిల్ కిందికి అనరు… అయ్యో బిడ్డా ఎంత పనై పాయెరా” అనుకుంట జెబుల నుంచి ఉశిరికాయల దస్తి మూట తీశి తాత నా చేతుల పెట్టిండు. అప్పటి వరకు ఉత్తగ ఉన్న నాకు బడ బడా కండ్లెంబడి నీల్లు గారినయి.
* * *
ముప్పై అయిదేల్ల తరువాత …
హై చేయిర్ మీద కూసున్న సంవత్సరంన్నర పాప బ్లూ బెర్రీస్ తినమంటె తినకుంట పిసికి కింద సల్లుతుంది
“బాంచనే బిడ్డా తినరాదు! నీకు ఇష్టంగదా స్ట్రాబెర్రీస్ కోశియ్యాల్నా?” అనంగనే
“నొ… నో !! నో !!!” అనుకుంట గిన్నె కింద పడేశింది
* * *
‘సిక్ ఇండస్ట్రీస్’ అన్న పేరుతోటి కొన్ని లక్షల మందికి (ప్రత్యక్షంగనో, పరోక్షంగనో) జీవనాధారమైన మిల్లులు ఎన్నో తెలంగాణల మూసేశింరు, వరంగల్లుల నర్సంపేట్ రోడ్ మీదున్న ఆజాంజాహి మిల్లు ఆ ‘సిక్ ఇండస్ట్రీస్’ల ఒకటి. పదిహేడెల్ల కిందట ఆజాంజాహి మిల్లు మూతబడ్డంక ఇప్పుడు వరంగల్లుల ఆర్థిక అభివృద్ధి చెందుతున్నా, ఆ దెబ్బకు చెల్ల చెదురైన జీవితాలు మాత్రం కాదేమో!?
Comments
2 Responses to “మా తాత తెచ్చే ఉసిరికాయలు ఎక్కడ ?”
Leave a Reply

May 25th, 2011 @ 4:39 am
katha muginpu manala gatham loki theesi kelluthundhi.
May 26th, 2011 @ 7:28 pm
katha chala bavundi.telangana mattini pattukunnaaru. u a r real hardcore telanganite. hats off to u. u have come off with flying colours. pl keep up writing. mee rachanalo nijaayitee mariyu pasi pillavaniloni amayakatvam kanipinchindi naaku. mana telangana valla daggara mosam undadu.
v expect many more telanga stories from ur ready n mighty pen. all the best.
urs, bhasker.k