Dec
20
తెలంగాణ ఉద్యమంలో కీలక మలుపు
December 20, 2009 | Tagged point, telangana, turning, ఉద్యమం, తెలంగాణ, మలుపు | 2 Comments
- ఎన్ వేణుగోపాల్
తెలంగాణ రాష్ట్ర సమితి నాయకత్వంలో ఎనిమిది సంవత్సరాలుగా, వివిధ ప్రజాసంఘాల నాయకత్వంలో పదమూడు సంవత్సరాలుగా సాగుతున్న ఈ దశ ఉద్యమం నవంబర్ 29న ఒక గుణాత్మకమైన మలుపు తిరిగినట్టనిపిస్తున్నది. ‘ఎక్కడా ఒక్క బస్సు అద్దం పగలకుండా, ఒక్క చుక్క నెత్తురు చిందకుండా సాగుతున్న’ ఈ దశ ఉద్యమంలో బహుశా మొదటిసారిగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పెద్ద ఎత్తున తెలంగాణ బిడ్డల నెత్తురు చిందింది. 1969 తర్వాత మళ్లీ ఒకసారి అంత పెద్ద ఎత్తున నిర్బంధకాండ సాగుతున్నది. నలభై ఏళ్ల తర్వాత తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష ఆ నిర్బంధాన్ని ప్రతిఘటించడం కూడ కనబడుతున్నది. పాత నినాదమైన ‘ఈట్ కా జవాబ్ పత్తర్ సే’ అనకపోయినా జవాబు సరిసమానమైన భాషలోనే ఉండాలని ప్రజలు ఎక్కడికక్కడ భావిస్తున్నారు.
ఈ పదమూడు సంవత్సరాలలో నిర్బంధమూ ప్రతిఘటనా అసలే లేవని కాదు. విప్లవోద్యమంతో అనుబంధం ఉన్నదనే సాకుతో తెరాస వరంగల్ నాయకుడు నల్లా వసంత్, తెలంగాణ జనసభ నాయకుడు సుదర్శన్, తెలంగాణ కళాసమితి కళాకారులు బెల్లి లలిత, ఐలయ్యలను పోలీసులో, కిరాయి హంతకులో హత్య చేశారు. ఆ హత్యలకు వ్యతిరేకంగా నిరసనలు, ప్రతిఘటనలు వెల్లువెత్తాయి. కాని ఇవాళ్టి నిర్బంధం, ప్రతిఘటనల స్థాయిని చూస్తే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం కీలక దశకు చేరుకున్నదనే అనిపిస్తున్నది.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షలను అణచివేతద్వారా రద్దు చేయవచ్చునని పాలకులు భ్రమ పడుతున్నారు. కాని ఒక సామాజిక సమస్యను, చరిత్రలో జరిగిన అన్యాయాలపై ప్రశ్నలను అణచివేత ద్వారా రద్దుచేసిన ఉదంతం ప్రపంప చరిత్రలో ఒక్కటి కూడ లేదు. అణచివేత తాత్కాలికంగా అనుకున్న పనిని సాధించినచోటకూడ, అణచివేయబడిన భావాలు ఆతర్వాత మరింత శక్తితో పెల్లుబికాయి. అణచివేత ప్రతిఘటనను విస్తరిస్తుంది అనే మాట ఆలంకారికమైన, శుష్కమైన మాట కాదు. నిన్నటికి నిన్న ఒక్క నాయకుడి ఆమరణ నిరాహారదీక్షను భగ్నం చేస్తే అది లక్షలాదిమందిలో దీక్షను బలోపేతం చేసింది. ఒక్క చంద్రుడిని మూసివేయదలచిన మేఘం తానే ముక్కలయి, వందలాది మడుగులయి, ప్రతి మడుగులోనూ ప్రతిబింబించిన వేలాది చంద్రబింబాలకు దారి తీసిందనే కవిత గుర్తుకొస్తున్నది.
ఉద్యమ క్రమంలోని ఈ గుణాత్మక మార్పు తెలంగాణ అసలు సమస్యల మీద అర్థవంతమైన చర్చకు, పరిష్కారానికి దారితీయవలసి ఉంది. తెలంగాణ ఆకాంక్షలు గత అరవై సంవత్సరాలుగా ఉన్నప్పటికీ, గత నలభై సంవత్సరాలుగా పోరాట వ్యక్తీకరణలు ఉన్నప్పటికీ, పదమూడు సంవత్సరాలుగా ఆరకుండా రగులుతున్నప్పటికీ అసలు సమస్య ఏమిటో అర్థం కానివాళ్లు, కానట్టు నటించేవాళ్లు, అర్థం చేసుకోదలచని వాళ్లు, మసిపూసి మారేడుకాయ చేసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు.
ప్రత్యేక రాష్ట్రమే ఏకైక పరిష్కారమని ఆలోచించే దిశగా తెలంగాణ ప్రజల ఆకాంక్షలు వ్యక్తం కావడానికి మూలకారణాలు మూడు: తెలంగాణ వనరుల దోపిడీ మొదటిది. సమైక్య రాష్ట్రంలో విలీనమవుతున్నప్పుడు, ఆతర్వాత యాభై సంవత్సరాలపాటు తెలంగాణకు కోస్తాంధ్ర పాలకులు, రాష్ట్రాన్ని పాలించిన నాయకులు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రతి ఒక్క వాగ్దానాన్నీ ఉల్లంఘించడం రెండవది. తెలంగాణ అస్తిత్వంలో, ప్రజాచైతన్యంలో తరతరాలుగా సాగుతున్న స్వయం నిర్ణయాధికార వాంఛ మూడవది. ఈ మూడు సమస్యలకూ పరిష్కారాలు సామాజిక, రాజకీయ, సాంస్కృతిక స్థాయిలో ఉంటాయి. చరిత్రలో జరిగిన అన్యాయాలకు సవరణలు మళ్లీ చరిత్ర క్రమంలోనే, దీర్ఘకాలికంగానే చేయవలసి ఉంటుంది. కాని ఒక సమస్యను సవ్యంగా, దానికి అవసరమయినంత సమయంలోనే పరిష్కరించకపోతే అది తప్పనిసరిగా హింసా మార్గాలను, ఇతర మార్గాలను ఎంచుకుంటుంది. ఇవాళ తెలంగాణ ఉద్యమకారుల భాష గురించి, సంస్కారం గురించి, హింస గురించి, దుందుడుకుతనం గురించి, కిరోసిన్, పెట్రోల్ పట్టుకుని భావోద్వేగాలను రెచ్చగొట్టడం గురించి కొందరు హితవచనాలు పలుకుతున్నారు. వాళ్లందరూ గుర్తించవలసినదేమంటే ఆ పరిణామాలన్నీ యాభై సంవత్సరాల చర్యల పర్యవసానాలు మాత్రమే. ఈ ప్రతిచర్యలను ప్రశ్నించేవాళ్లు మొదట ఆ చర్యలను ప్రశ్నించవలసి ఉంటుంది.
తెలంగాణ వనరుల దోపిడీ ఎలా జరిగిందో గణాంకాల ద్వారా వివరించిన అధ్యయనాలు ఎన్నో ఉన్నాయి. అది భూమి కావచ్చు, జలవనరులు కావచ్చు, ఖనిజవనరులు కావచ్చు, విద్యావకాశాలు కావచ్చు, ఉద్యోగావకాశాలు కావచ్చు, ప్రజాధనం కెటాయింపులు కావచ్చు – ఏ ఒక్క రంగంలోనూ తెలంగాణ వాటా తెలంగాణకు దక్కలేదు. తెలంగాణ నుంచి తీసుకున్న దానిలో సగమో పావో కూడ తెలంగాణకు తిరిగి ఇవ్వలేదు. ఆ వనరుల దోపిడీని సవ్యంగా సాగించాలంటే దోపిడీకి గురవుతున్న వాళ్ల అస్తిత్వాన్ని చిన్నబుచ్చడం, వారి భాషా సంస్కృతులను, చరిత్రను అవమానించడం బ్రిటిష్ వలసవాదులు అవలంబించిన పాత వ్యూహమే. అదేవిధంగా రెండువందల ఏళ్లుగా స్వతంత్ర రాజ్యంగా ఉంటూ తెలంగాణ అభివృద్ధి చేసుకున్న ప్రత్యేక అస్తిత్వాన్ని కోస్తాంధ్ర, రాయలసీమ పాలకులు అవమానిస్తూ వచ్చారు. ఆ ప్రత్యేక అస్తిత్వంలో నిర్మాణమైన సంపదనంతా ఉమ్మడి రాష్ట్రం పేరిట ‘రెండున్నర జిల్లాల రెండున్నర కులాల’ నాయకులు హక్కుభుక్తం చేసుకున్నారు. కాళోజీ ఆ మాట అన్న 1969కీ, ఇవాళ్టికీ తేడా ఏమంటే ఇప్పుడు రాయలసీమ నుంచి మరొక రెండు జిల్లాల మరొక కులం కూడ ఆ దోపిడీలో భాగం పంచుకుంటున్నది.
ఇటువంటి వనరులదోపిడీ, అవమానం, వివక్ష, అన్యాయం అమలవుతున్నాయనీ, అవుతాయనీ గుర్తించినందువల్లనే, షరతుల మీద మాత్రమే సమైక్యరాష్ట్రం ఏర్పడాలనే ఆలోచన కలిగింది. అలా ఆంధ్రప్రదేశ్ ఏర్పాటే పెద్దమనుషుల ఒప్పందం పేరిట షరతులతో కూడిన ఐక్యత. ఆ షరతులలో ఏ ఒక్కదాన్నీ పాలకులు పాటించలేదు. ఆ తర్వాత 1969 అఖిలపక్ష ఒప్పందం, 1969 ఎనిమిదిసూత్రాల పథకం, 1971 ఎన్నికల విజయం, 1972 సుప్రీంకోర్టు తీర్పు, 1973 ఆరుసూత్రాల పథకం, 1975 రాష్ట్రపతి ఉత్తర్వులు, 1975 రాజ్యాంగ సవరణ, 1986 జి వో నం. 610, 1998 బిజెపి కాకినాడ తీర్మానం, 2004 కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళిక, 2004 కామన్ మినిమమ్ ప్రోగ్రామ్, 2004 రాష్ట్రపతి ప్రసంగం, 2004 ప్రణబ్ ముఖర్జీ కమిటీ, 2005 గిర్ గ్లాని నివేదిక, 2008 రోశయ్య కమిటీ, 2009 తెలుగుదేశం ఎన్నికల ప్రణాళిక – ఇలా తెలంగాణ ప్రజలపట్ల ఎన్ని ద్రోహాలు జరిగాయో, ఎన్ని వాగ్దానాలు ఉల్లంఘనకు గురయ్యాయో లెక్కలేదు. ఈ రకంగా ఇన్ని వాగ్దానాల ఉల్లంఘన జరిగిన తర్వాత కూడ ఆగ్రహం రాకపోతే ఆశ్చర్య పోవాలి గాని ఆగ్రహం వచ్చినందుకు కాదు. ఇవాళ్టికీ ఆ ఆగ్రహం సంయమనం పాటిస్తూనే ఉంది.
ఇక ఆధిపత్యానికీ, దౌర్జన్యానికీ, దోపిడీ పీడనలకూ తలఒగ్గి ఉండకపోవడం, ఆత్మగౌరవంకోసం ప్రాణాలయినా బలిపెట్టడం, భిన్నంగా ఆలోచించడం తెలంగాణ వ్యక్తిత్వంలో కనీసం వెయ్యి సంవత్సరాలుగా కనబడుతున్నాయని సాంఘికచరిత్రకారులు సోదాహరణంగా వివరిస్తున్నారు. సమ్మక్క, సారలమ్మ, ప్రతాపరుద్రుడు, పాల్కురికి సోమన, బమ్మెర పోతన, సర్వాయి పాపడు, రాంజీ గోండు, కొమురం భీం, బందగీ, నాలుగువేలమంది తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు, షోయబుల్లా ఖాన్, గత నలభై సంవత్సరాలుగా విప్లవోద్యమంలో ప్రాణత్యాగం చేసిన వేలాది యోధులు, 1969 దమనకాండలో పోలీసుకాల్పులకు బలి అయిన 370 మంది విద్యార్థి యువజనులు కొనసాగిస్తూ వచ్చిన సంప్రదాయం అది. ఇవాళ సాగుతున్న నిర్బంధకాండకు వ్యతిరేకంగా తెలంగాణ వ్యాప్తంగా నిరసన తెలుపుతున్న వారందరూ కొనసాగిస్తున్నది ఆ వారసత్వాన్నే.
ఈ ఆకాంక్షలు ఇంత ప్రబలంగా ఉంటే ఎన్నికలలో ఎందుకు వ్యక్తం కావడం లేదనే కుంటిప్రశ్నతో అడ్డుకోవడానికి మరో ప్రయత్నం జరుగుతోంది. ఎన్నికలలో వ్యక్తమయ్యే ప్రజాభిప్రాయాన్ని గౌరవించేట్టయితే, 1971 తెలంగాణ ప్రజాసమితి విజయానికి ఎందుకు తూట్లు పొడిచారు అని ఎదురుప్రశ్న వేయవచ్చు. అసలు మన ఎన్నికల రాజకీయాలలో ప్రజాభిప్రాయం వ్యక్తం కావడానికి ఉన్న అవకాశాలు ఎన్నో, ఎన్నికలలో వ్యక్తమవుతున్నది నిజంగా సంపూర్ణంగా ప్రజాభిప్రాయం అవునో కాదో ఎవరికి వారు విశ్లేషించుకోవచ్చు.
ఇక ‘ఆంధ్ర వలసవాదులు’ అనడం ద్వారా తెలంగాణ ఉద్యమం కోస్తాంధ్రలోని సాధారణ ప్రజలను వ్యతిరేకం చేసుకుంటున్నదని మరొక విమర్శ. పొట్టకొట్టినవాళ్ల మీదనే తప్ప, పొట్టకూటికోసం వచ్చిన వాళ్లమీద తమ పోరాటం కాదని తెలంగాణ ఉద్యమకారులు అనేక సార్లు స్పష్టం చేశారు. ‘ఆంధ్ర వలస వాదులు’ అనే మాట వలసవాదం లేని ఆంధ్ర ప్రజలకు వర్తించేదేమీ కాదు. వలసవాదంతో నూటికి తొంబై మందికి సంబంధం లేనప్పటికీ బ్రిటిష్ వలసవాదులు అన్నట్టుగానే, అసలు తెల్లవాడే శత్రువు అన్నట్టుగానే, మతోన్మాదాన్ని, కులదురహంకారాన్నీ కొందరే ప్రదర్శించినప్పటికీ ఆయా మతాల, కులాలపేర్లు ప్రస్తావించినట్టుగానే, ఇది ప్రతివాదనల పరిభాషేతప్ప, సాధారణ ఆంధ్రప్రజల పట్ల, న్యాయమైన తెలంగాణ ఆకాంక్షలను సమర్థించే ఆంధ్రప్రజల పట్ల వ్యతిరేకత కాదు. ఇది నిజానికి తెలంగాణ ప్రజలకూ పాలకులకూ మధ్య, 53 సంవత్సరాలుగా సాగుతున్న పాలకవిధానాలతో ఘర్షణే గాని తెలంగాణ ప్రజలకూ ఆంధ్ర, రాయలసీమ ప్రజలకూ మధ్య ఘర్షణ కాదు. నిజానికి తెలంగాణకు ద్రోహం చేసిన పాలకులు ఉత్తరాంధ్రకూ, పల్నాడుకూ, రాయలసీమలో అనేక ప్రాంతాలకూ కూడ ద్రోహం చేస్తున్నారు.
ఇది కేవలం ఒక రాజకీయ నాయకుడి సమస్య కాదు, ఒక రాజకీయ పార్టీ సమస్య కాదు. నాలుగుకోట్ల తెలంగాణ ప్రజల సమస్య. దానికి రాజకీయ పరిష్కారాన్ని తక్షణం చూపవలసి ఉంది. తెలంగాణ ప్రజల న్యాయమైన ఆకాంక్షలను మొత్తం తెలుగుజాతి మాత్రమే కాదు, అణచివేతకూ దోపిడీకీ పీడనకూ గురవుతున్న ప్రజలందరూ సమర్థించవలసి ఉంది. ఇది కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర, రాయలసీమలలో కూడ అత్యధిక ప్రజానీకం సమర్థించవలసిన, సంఘీభావం ప్రకటించవలసిన, పాల్గొనవలసిన సమస్య. ఇది ప్రాంతీయ విద్వేషాల సమస్య కాదు, అన్ని ప్రాంతాల ప్రజలు సంఘీభావం ప్రకటించవలసిన న్యాయమైన ఆకాంక్షల సమస్య.
(Courtesy: Kadalitaraga)
Comments
2 Comments so far
[...] Read Completely >> [...]
tealangaana udyama geetaalu/paatalakai..
http://www.raki9-4u.blogspot.com choosi spandinchi vyaakhyaaninchi..prachaaram cheyandi..
jai telangaana