పరిష్కారం ఏదైనా ప్రజలే గెలవాలి

రొమాంటిక్‌ రంగు పులమడం అర్థరహితం

సమస్య పట్ల అవగాహనా, భావోద్వేగాలకు లోనుగాకుండా తార్కికంగానూ దూరదృష్టితోనూ పరిష్కారం ఆలోచించగల వివేచనా కనిపించడం లేదు. ‘సమైక్యాంధ్ర’ బోలు నినాదం. ప్రత్యేక తెలంగాణ అంత తేలిగ్గా ఇవ్వరన్న నమ్మకంతో ఇన్నాళ్లూ అందుకు మద్దతు పలికిన రాజకీయ పార్టీలూ, ఉద్యమం జరుగుతున్నన్నాళ్లూ చోద్యం చూస్తూన్న ఇతర ప్రాంత ప్రజలూ ఇప్పుడు సమైక్యాంధ్ర అంటూ గొంతు చించుకోవడం విచిత్రం. ఇన్నాళ్లూ అమలు జరపని ఒప్పందాలూ, నిష్పక్షపాతంగా వనరుల, నిధుల కేటాయింపూ ఇప్పుడు పాటిస్తామనే భరోసా ఇవ్వడం అటుంచి వాటి ఊసే ఎవరూ ఎత్తకపోవడం సమస్య మూలాలు విస్మరించడమే.

విడిపోవడం ఎప్పుడూ బాధాకరమే అయినా తెలుగు తల్లి ముక్కలు అవుతోందంటూ దానికి రొమాంటిక్‌ రంగు పులమడం అర్థరహితం. అభివృద్ధిలో ప్రాంతీయ అసమానతల్ని రూపుమాపే సమగ్ర ప్రణాళిక లేకుండా సమైక్యాంధ్ర మనలేదు. అభివృద్ధి, లేదంటే ప్రత్యేకం అన్న నినాదానికి తెలంగాణా ఉద్యమం చివరిదాకా కట్టుబడి ఉండవలసింది. ఆంధ్ర నుంచి వలసలు వచ్చినవారిని దోపిడీదారులుగా చిత్రించడం, విద్వేషాన్ని రగల్చడం ఎవరికీ మేలు చేయదు. ఏ ప్రాంతంవారయితేనేం, పరిశ్రమలు, నెలకొల్పకపోతేనూ, భూములు కొనకపోతేనూ హైద్రాబాదు ఆర్థికంగా ఈ స్థాయికి చేరేది కాదు. విడిపోయినా, కలిసి ఉన్నా దృష్టి నిలపవలసింది తెలంగాణతోపాటుగా రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల అభివృద్ధిపైన.

- చంద్ర కన్నెగంటి, రచయిత, డల్లాస్‌, టెక్సస్‌

ఐదు భాగాలుగా ఆంధ్రప్రదేశ్‌

ఉద్రేకం ఊరికి నష్టం అంటారు. ఉద్రేకం తార్కికతని మటుమాయం చేస్తుంది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని నాలుగు లేకపోతే ఐదు భాగాలుగా విభజించడానికి వ్యతిరేకత చూపే మేధావుల (!) వాదోపవాదాలు, ఈనాటికీ ఎమోషనల్‌ స్థాయి దాటిపోలేదు. కొందరు మేధావులు అధివాస్తవిక స్థాయిని మించిపోయారు. ఈ వాదోపవాదాలకి అసలు కారణం సంకుచిత మనస్తత్వం. భాషపరంగా, సంస్కృతి (?) పరంగా వ్యాపారపరంగా సమైక్యంగా ఒకే రాష్ట్రంగా ఉండడం శ్రేయస్కరం అనే వాదంలో నైతిక బలం తక్కువ. స్థానిక బలం పాలు ఎక్కువ. ఆవేశం పాలు అంతకన్నా జాస్తి. అయితే కొన్ని ప్రత్యేక వర్గాలకి తాత్కాలిక రాజకీయావశ్యకతే ఈ వాదానికి ఆధారం అనడానికి సందేహం ఉండకూడదు.

పదికోట్ల జనాభా పరిపాలనా యంత్రాంగానికి, రెండున్నర – మూడుకోట్ల జనాభా పరిపాలనా యంత్రాంగానికీ మధ్య ఉండే అంతరం, దాని సౌలభ్యతా అర్థం చేసుకోవడానికి ఆర్థికశాస్త్రంలో ప్రావీణ్యత అక్కరలేదు. ఒకరిని మించి మరొకరు తెలుగుభాషా పునరుద్ధరణకి పాటుపడతారు. భాషాపరంగా, భాషాభివృద్ధికోసం సమైక్యత పెరుగుతుంది. తెలుగుకోసం ఇప్పటికన్నా బాగానే కృషిచేస్తారు. మన భారతీయ సంస్కృతి వేరువేరు రంగుల్లో, వివిధ రకాల ఛాయల్లో దేశవ్యాప్తంగా ఉన్నది.

ఆ ఛాయలనీ అలుసుగా నిందించడానికి బదులుగా సరసంగా గౌరవించడం అలవాటవుతుంది. అంటే భిన్నతని గౌరవించడం అలవాటవుతుంది. అందుకని, ఆంధ్రప్రదేశ్‌ని, ఉత్తర ఆంధ్ర, మధ్య ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ రాష్ట్రాలుగా విభజించడం అన్నివిధాలా సముచితం; శ్రేయస్కరం; అభివృద్ధిదాయకం. అయితే, హైదరాబాదు నగరాన్ని మాత్రం ఈ నాలుగు రాష్ట్రాలకీ తాత్కాలిక రాజధానిగా కనీసం పది-పదిహేనేళ్లపాటు ఉంచడం, మామూలు ప్రజలందరికీ శ్రేయస్కరం. అలా హైదరాబాదుతో కలిపి ఐదు భాగాలుగా చెయ్యడం సముచితంగా కనిపిస్తుంది.

- వేలూరి వేంకటేశ్వరరావు, రచయిత, అట్లాంటా, జార్జియా

తెలుగు సంయుక్త రాష్ట్రాలు

ఎలా, ఎప్పుడు పుట్టుకొచ్చినా, ఎంత సమంజసమైనది అయినా ఈనాటి తెలంగాణా ఉద్యమం ‘మాకు అన్యాయం జరిగింది’ అనే నినాదంతో, పాలకులను మార్చడానికే ప్రాధాన్యత ఇచ్చింది కానీ, కొత్త పాలకులు కావలసిన అభివృద్ధిని తెచ్చే పథకాలను కనీసం సూచనప్రాయంగా అయినా వెలుగులోకి తీసుకురాకపోవడం విచారకరం. అలాగే సమైక్యాంధ్రావాదులు కూడా, ప్రస్తుత వ్యవస్థ యధాతథంగా ఉండాలనే తపన తప్ప మౌలికమైన అంశాలు ప్రస్తావించే పరిస్థితిలో లేరు. ఎటునించి, ఎటుచూసినా ఈ ఉద్యమాలన్నీ రెండు అగ్రవర్గాల మధ్య రాజకీయ, ఆర్థిక ఆధిపత్యాలకోసం పోటీయే.

బడుగువర్గాలూ, పేరుకి మాత్రమే అగ్రవర్గాలైన ఇతరులూ ఆటలో అరటిపండ్లే. అందువలన ఆంధ్రప్రదేశ్‌ ఎన్ని రాష్ట్రాలుగా విడిపోయినా, పోకపోయినా, అభివృద్ధి, సమానత, జీవన విధానంలలో చెప్పుకోదగ్గ మార్పులు నాయకత్వ మార్పిడి జరిగినంత తొందరగా వస్తాయని అనుకోకూడదు. భాష విషయంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటుందేమో? ఎందుకంటే తెలుగు భాషా, సాహిత్యమూ అనాధలు. వాటికి వ్యాపార లావాదేవీలూ, వోట్‌బేంకులూ లేవు. గ్లామరు అంతకంటే లేదు. రాజకీయ ప్రాధాన్యత లేని కారణం వలన వాటికోసం ఉద్యమించే నాయకులు లేరు. హైదరాబాదు అభివృద్ధి మార్గంలో ఎలాగూ ఉంది కాబట్టి, రాష్ట్ర విభజన జరిగినా, జరగకపోయినా రాష్ట్ర రాజధానిని మరొక ప్రాంతానికి మారుస్తే ఆ ప్రాంతాల అభివృద్ధికీ, బహుశా భాష పరిరక్షణకీ అన్నివిధాలుగానూ బావుంటుందేమో!

- వంగూరి చిట్టెన్‌ రాజు, హ్యూస్టన్‌, టెక్సస్‌

బలవంతం న్యాయం కాదు

చాలాకాలంగా ప్రత్యేక రాష్ట్రం కావాలని తెలంగాణ ప్రజలు కోరుతూ వచ్చారు. ఆ కోరికను అప్పుడప్పుడూ రాజకీయ నాయకులు, తెలంగాణలోనూ తెలంగాణేతర ప్రాంతంలోనూ, స్వప్రయోజనాలకు ఉపయోగించుకుంటూ వచ్చారు. ఇప్పుడూ అదే జరుగుతూ ఉంది. అయినా ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం ప్రత్యేక రాష్ట్రం కావాలనే కోరిక తెలంగాణ ప్రజల్లో బలంగా ఉన్నట్లు కనిపిస్తుంది. ఇప్పుడు తెలంగాణను బలవంతంగా సమైక్య ఆంధ్రలో భాగంగా ఉండమనటం న్యాయం కాదు.

ఐక్యంగా ఉండాలంటే ముందు సమంగా ఉండాలిగదా? సమంగా ఎదగనివ్వలేదనే గదా తెలంగాణ ప్రజలు అంటుంది? సమంగా ఎదగకపోవటానికి కారణం ఎవరైనా, ఇకముందు వారి అభివృద్ధికి తగిన ప్రయత్నాలు వారే చేసుకునే అవకాశం కల్పించటమే న్యాయమనిపిస్తుంది నాకు. మరో విషయం, గత పదిహేనేళ్లుగా సంయుక్త రాష్ట్రాన్ని పరిపాలించిన నాయకులు తెలుగు భాషకు ద్రోహం చేస్తూ వచ్చారు. పొరుగు రాష్ట్రాలవారు తమ భాషలకు ఇస్తున్న మద్దతు మన రాష్ట్రంలో తెలుగుకు లేదు. ఆంధ్రప్రదేశ్‌ని రెండుగానో మూడుగానో విభజిస్తే, వీరిలో ఒక్కరైనా తెలుగు భాషాభివృద్ధికి తోడ్పడతారేమోనని నా ఆశ.

- ఆరి సీతారామయ్య, కథా రచయిత, డెట్రాయిట్‌, మిషిగన్‌

ప్రజలు ప్రేక్షక స్థానాన్ని వదిలాలి

2002లో తెలంగాణ నినాదం గొంతు విప్పుకుంటున్నప్పుడు, ప్రవాసం నుంచి మాతృదేశానికి వచ్చి హైదరాబాదులో ఉన్నాను నేను. రెండేళ్ల పాటు తెలంగాణా పల్లెపల్లెల్లో విస్తృతంగా పర్యటించాను. తెలంగాణ ప్రజానాయకుల నుంచి ప్రత్యేక రాష్ట్రం ఆవశ్యకతకి ఉన్న చారిత్రక సైద్ధాంతిక అవసరాల్ని తెలుసుకుని అర్ధం చేసుకున్నాను. చూస్తుండగానే టీఆర్‌ఎస్‌ ఉద్భవించింది. కెసిఆర్‌ మహానాయకుడిగా ఎదిగారు. రాష్ట్ర ఆవిర్భావానికి సరైన వేదిక ఏర్పడిందని నా స్నేహితులైన ప్రజానాయకులతోపాటు నేనూ సంతోషించాను. ప్రత్యేక రాష్ట్రం కూడదన్న నా కోస్తాంధ్ర మిత్రులతో విభేదించి వాదించాను కూడా. కానీ 2004 ఎన్నికల నుంచీ జరుగుతూ వస్తున్న తెరచాటు రాజకీయాలు ఉద్యమాన్ని తప్పుదారి పట్టించి నిర్వీర్యం చేస్తూ వస్తున్నాయి.

ఒకప్పుడు ఎంతో ఆశతో సంఘపు అట్టడుగు పొరల్నించీ స్పందించి నిర్మించుకున్న వేదికపైన సామాన్య తెలంగాణా పౌరునికి స్థానం లేకుండా పోయింది. అతని గొంతు వినిపించనంతగా రాజకీయ రొద చెవులు దిబ్బెళ్లు వేస్తోంది. ప్రత్యేక తెలంగాణ అనేది సభ్య సమాజపు చర్చల్లో ఒక అపహాస్యంగా తయారైంది. 1969లో ఇలాగే వ్యక్తిగత ప్రయోజనాల కోసం బడా నాయకులు అప్పటి ఉద్యమాన్ని భూస్థాపితం చేశారు. కోట్ల ప్రజల ఆశయాలు ఒక్క మంత్రి పదవితో చెల్లు. ఇప్పుడు అదే వేదిక మీద జరుగుతున్న డ్రామా అప్పటి నాటకం కొనసాగింపే. ఐతే ఇదే చివరి అంకం మాత్రం కాదు. తెలంగాణా ప్రజలు తమ ప్రేక్షక స్థానాన్ని వదిలి తమ భవిష్యత్తు స్క్రిప్టు తామే రాసుకోవాలి! అప్పుడు కానీ ఈ డ్రామాకి తెరపడదు!

- ఎస్‌.నారాయణ స్వామి కథా రచయిత, బ్లూంఫీల్డ్‌ హిల్స్‌, మిషిగన్‌

రెండు రాష్ట్రాలూ బాగుపడతాయి

తెలంగాణ తనకున్న అస్తిత్వాన్ని నిలబెట్టుకోవటానికి పడ్డ అవస్థలు ఇప్పటివి కావు, నాలుగైదు వందల ఏండ్ల సంది ఉన్న లొల్లే ఇది. ఇక్కడివాళ్లు తమ నిరసనను ఏదో ఒక రకంగా బయటపెడ్తనే ఉన్నరు. అక్కడి నరనరాల్లో ఉన్న తిరుగుబాటు తత్వాన్ని అర్థం చేసుకోవటానికి వలసవాద ఎలిటిస్టు ధోరణి అడ్డొచ్చింది.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేది ప్రతి ప్రజాస్వామ్యవాది హర్షించవలసిన విషయం. ఇప్పటికే ఈ రైలు రెండు జీవిత కాలాల లేట్‌. ఇప్పటికైనా దీన్ని ఒక మంచి మలుపుగా తీసుకుని, అనిశ్చితి తొలగినందుకు సంతోషించి అన్ని ప్రాంతాలవారు అభివృద్ధికి పెద్దపీట వేయాలి.. తెలంగాణ అభివృద్ధి చెందితే ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌ తగ్గి ఉండేది అనుకోవటం ఒక భ్రమ.

ఎంతగా అభివృద్ధి చెందితే అంతగా స్వయంనిర్ణయాధికారం కోరుకోవటం జరుగుతుంది. ‘సమైక్యాంధ్ర’ నినాదంలో పస లేదు, దానికి ‘మోరల్‌ రూట్స్‌’ లేవు. నీతి లేని కథ నీటిమూటే, చాలా కాలాలు నిలువలేదు. ఇప్పుడు జర్నలిస్టులు, టీచర్లు, విద్యార్థులు, రాయటం తెలిసినవాళ్లంతా సమైక్యాంధ్ర పేరుతో వచ్చే రెండు గంటల సినిమా కల్చర్‌ నుంచి బయటకొచ్చి, నిజ జీవితాలెట్లా బాగుపడతాయి అని ఆలోచించాలి. రెండు రాష్ట్రాలవటం మన జీవిత కాలంలో వచ్చిన ఒక గొప్ప అవకాశం. ఈ అవకాశాన్ని ప్రజలెట్లా ఉపయోగించుకోగలరో ఆలోచన చేయాలి.

- విప్లవ్‌, కథా రచయిత, టల్సా, ఒక్లహోమా

కృత్రిమ ‘ఆందోళన’ కుట్రే!

‘సమైక్యాంధ్ర’లో తెలంగాణ, రాయలసీమవి ఎప్పటికీ ఊరి చివరి బతుకులు. వెలివేయబడిన చరిత్ర వాటిది.. కోస్తా సంపన్నుల పెత్తనం నించి విడివడితే తప్ప తెలంగాణ, రాయలసీమ బాగుపడవు. ఇది ఆ రెండు ప్రాంతాల ఉనికి సమస్య. ఇటీవలి తెలంగాణ ఉద్యమం కేవలం రాజకీయ శిబిరాల నించి ఎగసిపడింది కాదు, అనేక రకాలుగా అణగారిపోయిన విద్యార్థుల, పీడితుల, దళిత ముస్లింల ఆగ్రహంలోంచి రాజుకున్న అస్తిత్వ ఉద్యమం. ఇన్నాళ్ల అసమానత్వ రాజకీయాలకు ఆలశ్యంగానయినా ప్రాయశ్చితం చేసుకుంది కాంగ్రెస్‌. ఫక్తు పేదరికంలో కన్ను తెరచిన బాల్యం తెలంగాణ, సీమ రచయితలది. వీరి సాహిత్యాలలో తొలుత ప్రతిధ్వనించిన ఈ ఆకలి, అస్తిత్వ ప్రకంపనలు ఇప్పుడు రాజకీయ, విద్యార్థి ఉద్యమమై, ప్రత్యేక తెలంగాణ వైపు వెళ్లడం సహజ చారిత్రక పరిణామం.

దాన్ని సమైక్యాంధ్ర అనే కృత్రిమ ‘ఆందోళన’తో చల్లార్చాలని అనుకోవడం నిజంగా కుట్ర. కాస్త నిక్కచ్చిగా- ఖుల్లంఖుల్లా- చెప్పాలంటే, కబ్జాకోరు రాజకీయార్థిక కుట్ర. ఇంకోవైపు తెలుగు భాషనీ, సంస్కృతిని దోచేసుకోవాలన్న ఆబ. తెలంగాణ, సీమ బ్రదర్స్‌ని కలుపుకుందాం అని ఇప్పుడు చెబ్తున్న కోస్తా రాజకీయ సంపన్నులు, సాహిత్య పెత్తందారులు తెలంగాణ, సీమ జనాన్నే కాదు, భాషా, సాహిత్యాల్ని కూడా ఎగతాళి చేసినవాళ్లే. తమ పెత్తనం కోసం తెలంగాణ, సీమల్ని తొక్కిపడేసినవాళ్లే.

- అఫ్సర్‌, కవి, రచయిత, విమర్శకులు, ఆస్టిన్‌, టెక్సస్‌

చిన్నరాష్ట్రాల అభివృద్ధికి దాఖలాలేవి?

శాంతి, సహనం, సమభావం.. ఏవీ చరిత్ర మనకు నేర్పిన పాఠాలు? ఏవీ శతాబ్దాల మన సంస్కృతి మనకు నేర్పిన విలువలు? నిన్నటివరకూ సోదరులం అనుకున్న వాళ్లని కుక్కలనీ, పందులనీ తిట్టడం, దిష్టిబొమ్మల దహనం, ఇష్టం వచ్చిన రీతిలో ప్రభుత్వ ఆస్థుల్ని ధ్వంసం చేయడం, బోర్డులు మార్చివేయడం.. ఇదంతా వెర్రి తలలు వేసిన ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యం ముసుగులో జడలు విప్పిన అరాచకం! ఎక్కడికి వెళుతున్నాం? యువతరం సంపాదించిన విజ్ఞాన ఫలితం ఇదేనా? కేవలం విభిన్నమైన భాషలు మాత్రమే కాదు, విభిన్నమైన జాతులు, మతాలు, దేశీయులు కలిసి సహజీవనం సాగిస్తున్న అంతర్జాతీయ దేశాల్ని గమనించి కూడా మనం పాఠాలు నేర్చుకోలేదంటే లోపం ఎక్కడుందో ఆలోచించాలి.

అభివృద్ధి కుంటుపడుతోందనుకున్న ప్రాంతాలు దానికి పరిష్కారాలు విశ్లేషించాలి, అభివృద్ధి పథకాల కోసం ప్రభుత్వాన్ని డిమాండ్‌ చెయ్యాలి, సాధించుకోవాలి. ప్రజాస్వామ్యం ఉన్నదే అందుకోసం. చిన్నరాష్ట్రాలు అభివృద్ధి పథంలోకి దూసుకుపోయిన దాఖలాలు ఏవీ? హైదరాబాదు ముఖచిత్రాన్ని మార్చివేసిన అంతర్జాతీయ కంపెనీలకి మనం ఇస్తున్న భరోసా ఏమిటి? తక్షణ కర్తవ్యం రాజకీయ నాయకుల ముసుగులోని స్వార్థపూరిత శక్తుల్ని అదుపులో పెట్టడం, శాంతియుత వాతావరణంలో చర్చలకు కూర్చోవడం జరగాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకి చిత్తశుద్ధి, రాజకీయ ఒత్తిళ్లకి లొంగని దృఢ సంకల్పం ఉంటేనే ఇది సాధ్యమౌతుంది.

- కిరణ్‌ ప్రభ, కవి, రచయిత, డబ్లిన్‌, కాలిఫోర్నియా

దోపిడీని కొనసాగించే నినాదం

ప్రపంచంలో తొట్టతొలి నాగరికతలన్నీ నదీతీరాల్లో విరాజిల్లినాయి. కానీ రెండు మహానదుల పరీవాహక ప్రాంతమైన తెలంగాణ మాత్రం గత 50 ఏళ్ళుగా బీడు పడిపోయి ఎడారిగా మారిపోయింది. 1956లో ఆంధ్రప్రదేశ్‌లో భాగమైనప్పటి నుంచి నేటి దాకా, ఆంధ్ర వలసపాలకుల దోపిడీలో తెలంగాణకు జరిగిన నష్టం అపారమైనది. తెలంగాణ నీటినీ, నిధులనీ, ఉద్యోగాలనీ, భూమి జాగాలనీ దోచుకుని, ఆంధ్రా ప్రాంతపు భూస్వాములు, పాలక వర్గాలు, బడా వ్యాపారులు, కాంట్రాక్టర్లు, సినిమా వాళ్ళు కోట్లకు కోట్లకు లెక్కలేనన్ని ఆస్తులు గడించారు. తెలంగాణ ప్రాంత ప్రజానీకాన్ని కడు పేదరికానికీ, అలవికాని కష్టాలకూ కడగండ్లకూ గురి చేశారు. చారిత్రికంగా భౌగోళికంగా తెలంగాణ ఒక ప్రత్యేక రాష్ట్రం.

ఇది కాదనలేని వాస్తవం. తెలంగాణ ఆంధ్రప్రదేశ్‌లో భాగం ఎప్పుడూ కాదు. కాలేదు కూడా! ఒకే భాష మాట్లాడినంత మాత్రాన ఒకే రాష్ట్రంగా ఉండాలని ఎక్కడా లేదు. ప్రత్యేక రాష్ట్ర డిమాండు ప్రజాస్వామికమైనది. దాన్ని ప్రజాస్వామ్యవాదులంతా ప్రపంచవ్యాప్తంగా గౌరవిస్తున్నారు. సాంస్కృతికంగా కూడా తెలంగాణకు ఒక స్వతంత్ర ప్రతిపత్తి ఉన్నది. భౌగోళికంగా, చారిత్రికంగా, రాజకీయంగా, సాంస్కృతికంగా, ఆర్థికంగా ప్రత్యేక ప్రతిపత్తి కలిగిన తెలంగాణను ఆంధ్ర ప్రాంతంతో కలిపి సమైక్యంగా ఉండమని ఒత్తిడి చేయడం అప్రజాస్వామికం, అన్యాయం, నిరంకుశత్వం కూడా. ప్రత్యేక రాష్ట్ర ప్రకటన వెలువడిన వెంటనే కోస్తాంధ్ర, రాయలసీమలకు చెందిన పాలక వర్గాలు, వారి అడుగులకు మడుగులొత్తే రాజకీయ నాయకులు (పార్టీల కతీతంగా) ఒక్క తాటి మీద ముందుకొచ్చి తమకు సమైక్యాంధ్ర కావాలని పెద్ద ఎత్తున ఆందోళన లేవ దీస్తున్నారు.

మూడున్నర కోట్ల తెలంగాణ ప్రజలని, వారి ప్రజాస్వామిక ఆకాంక్షలని, వారి కలలని అపహాస్యం చేస్తున్నారు. అవమానిస్తున్నారు. ఇది అప్రజాస్వామికం, నిరంకుశత్వం! తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు వీళ్ళంతా సమైక్యాంధ్ర అని ఎందుకనలేదు? పైగా అన్ని రాజకీయ పార్టీలు తెలంగాణను సమర్థిస్తామని అన్న వాళ్ళే కదా! తెలంగాణకు జరిగిన అన్యాయం గురించీ వివక్ష గురించీ ఒక్కసారయినా మాట్లాడని ‘సమైక్యాంధ్ర’వాదులు ఇవాళ్ల కలిసి ఉండాలని, విడిపోవడానికి వీల్లేదని ఆధిపత్య ధోరణితో ఉద్యమం లేవనెత్తడం అప్రజాస్వామికం కాదా? నిరంకుశత్వం కాదా? వీళ్లు ఇవాళ నిరసనలు, దీక్షలు, విధ్వంసాలు పార్టీలకతీతంగా కొనసాగించడానికి కారణమేమిటి? ఇన్నాళ్లూ తాము యదేచ్ఛగా దోచుకుతిన్న తెలంగాణ వనరులు, నీళ్లు, నిధులు, ఉద్యోగాలు, భూమి జాగలు ప్రత్యేక తెలంగాణ వల్ల ఎక్కడ చేజారిపోతాయోనని, హైదరాబాద్‌ కేంద్రంగా సాగుతున్న వారి దోపిడీకి వ్యాపారాలకు ఆస్తులకు ఆటంకం కలుగుతుందనే భయంతోనే!

‘సమైక్యాంధ్ర’ దోపిడీని యథాతథంగా కొనసాగించే నినాదమనీ ప్రజాస్వామికవాదులంతా ఒక్క గొంతుతో చాటించాలి. తెలంగాణలో నివసిస్తున్న సామాన్య ఆంధ్ర ప్రజానీకానికి ఎటువంటి హానీ కలుగదనీ, వారంతా దయగల తెలంగాణ తల్లి ఒడిలో క్షేమంగా నివసించవచ్చనీ తెలంగాణ ఉద్యమకారులు భరోసా ఇవ్వగలగాలి. వారిని కూడా తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కలుపుకుపోగలగాలి. అట్లా ఆంధ్రా ప్రాంత దోపిడీ పాలకుల పన్నాగాలని, సమైక్యాంధ్ర కుట్రలనీ బలంగా తిప్పికొట్టాల్సిన అవసరమూ కర్తవ్యమూ ప్రజాస్వామికవాదులందరిదీనూ!

- నారాయణ స్వామి, కవి, ప్రిన్స్‌టన్‌, న్యూజెర్సీ

కలసి వుంటే కలదు సుఖం

‘కలసి వుంటే కలదు సుఖం’ అనేది సామాన్య ప్రజానీకానికీ, సమాజానికీ ఎంతో మంచిది. ‘విభజించి పాలించు’ అనేది రాజకీయ నాయకులకూ, స్వంత లాభం కోరుకునేవాళ్లకూ ఉపయోగకరం. 1970లలో రాజకీయ వినాయకులు పదవులు రాక చేసినదే, ఇప్పుడు మళ్లీ చేస్తున్నారు. ఇప్పుడు నిప్పు రాజుకుని, రాష్ట్రం తగలబడుతున్నది కనుక నాకు రెండే పరిష్కారాలు కనిపిస్తున్నాయి- హైదరాబాద్‌లో కొత్త పరిశ్రమలు తగ్గించి, సమైక్య రాష్ట్రంలో అన్ని రాష్ట్రాలలోనూ పరిశ్రమలకు పెట్టుబడులు తీసుకువచ్చి మొదలుపెట్టటం, ఎయిర్‌పోర్టులు మొదలైన వాటితో ప్రతిచోటా అభివృద్ధి సాధించటం అవసరం. రెండు: హైద్రాబాద్‌ పెట్టుబడులవల్లా, జనాభావల్ల ఒక జాతీయ నగరం. హైద్రాబాద్‌ని ఒక యూనియన్‌ టెర్రిటోరీగా చేసి, తెలంగాణ, ఆంధ్రాలను వేరు చేయటం. అప్పుడు రాయలసీమ కూడా వేరుపడాలి అనే రాజకీయ నాయకులు వుంటారు. మరి వాళ్లకేం సమాధానం చెప్పాలి? చిన్న రాష్ట్రాల వల్ల పెద్దగా లాభాలు వుంటాయని నేను అనుకోను. చూద్దాం ఏమవుతుందో!

- సత్యం మందపాటి, రచయిత, ఆస్టిన్‌, టెక్సస్‌

సమైక్యతకు తలవొగ్గినా భవిష్యత్తులో కష్టం

గుంటూరు జిల్లాలో పుట్టిన నేను 14 ఏళ్ల వరకు మద్రాస్‌లో, పదేళ్లు హైదరాబాద్‌లో వున్నాను. 1983 నుండి కనడాలోని టొరంటోలో నివాసం. ఆంధ్రదేశమంతా కలసికట్టుగా వుండాలని కాంక్షించేవారిలో నేనొకదాన్ని. అయినప్పటికీ ప్రస్తుతం జరుగుతున్న మనస్సును కలచివేసే సంఘటనల దృష్ట్యా విభజన తప్పదనీ, తాత్కాలికంగా ఏదో ఒక నిర్ణయానికి కట్టుబడి సామరస్యంగా ముందుకు వెళ్లాలని భావిస్తున్నాను. సమైక్యతకు తలవొగ్గినా భవిష్యత్తులో తప్పనిసరిగా ఈ సమస్య ఇంతకంటే అధిక నష్టంతో ప్రజ్వరిల్లే అవకాశాలు చాలా వుంటాయి.

అందువల్ల వారి కోరికను అంగీకరించే ముందు ఆంధ్రా తెలంగాణా రాజకీయ నాయకులందరూ కలసి విభజన వల్ల కలిగే ఉపయోగాలూ, నష్టాలూ కూలంకషంగా చర్చించే సదవకాశాన్ని ఒకటికి పదిసార్లు ఏర్పాటు చేసుకోవాలి.. ఈమధ్యకాలంలో సినిమాలు, నవలలూ, పాటలూ మొదలైనవన్నీ తెలంగాణా ‘యాస’లో వస్తుండటం వారి ప్రాంతీయ భాషకి ప్రాముఖ్యత బాగా ఇస్తున్నట్లు అవగాహనకు వస్తోంది. అన్నదమ్ములమే అయినా విభజన జరగాల్సిన సమయం ఆసన్నమైంది. తెలంగాణా ప్రాంతీయుల ఆకాంక్ష మేరకు ఆ ప్రాంతం అద్భుతమైన ప్రగతిని సాధించగలదనీ నా ప్రగాఢ విశ్వాసం.

- కొమరవోలు సరోజ, రచయిత్రి, టొరంటో, కెనడా

మార్పు తేకుండా విభజన లాభంలేదు

గాంధీగారి నించి నేర్చుకున్న నిరాహార దీక్షని హింస చెలరేగడానికీ, జనజీవితం స్తంభించిపోవడానికీ ఉపయోగించుకుంటున్న రాజకీయ నాయకుల పద్ధతి చూస్తే వీళ్లు దేన్నైనా తమ లాభాల కోసం ఉపయోగించుకోగలరని బోధపడుతుంది. ఇందులో తెలంగాణా లేదు, ఆంధ్రా లేదు, తెలుగు జాతి అసలే లేదు. వున్నదల్లా రాజకీయ నాయకుల, బడాపెట్టుబడిదార్ల స్వప్రయోజనాలే. తెలంగాణ ఇస్తే ఎవరికి లాభమో, ఇవ్వకపోతే ఎవరు బాగుపడతారో మేధావులు (ఇంతవరకూ నిశ్శబ్దంగా వున్నవారు) సమర్థంగా చర్చించాలి. సమర్థమైన చర్చలవల్ల తెలంగాణా ఇవ్వడం అక్కడి ప్రజలకి లాభమని స్పష్టపడితే, తెలంగాణా వేరుచెయ్యమని అడగాలి. ఇది ఆవేశాలవల్ల తేలవలసిన సమస్య కాదు.

అమాయకులైన విద్యార్థులు ప్రాణాలు, చదువులు పోగొట్టుకుంటే తేలే సమస్య కాదు. అల్లర్లవల్లా, ప్రాణాలు పోగొట్టుకోడం వల్లా, ఇలాటి సమస్యలు పరిష్కారం అయితే, ఆ పరిష్కారం మళ్లీ కొన్ని కొత్త సమస్యల్ని సృష్టిస్తుంది. పరిపాలనలో మార్పులే తేకుండా కేవలం రాష్ట్ర విభజన వల్ల ప్రజలకి కలిసొచ్చేదేమీ లేదని ప్రజలకి చెప్పగల మేధావులు రావాలి. పరిపాలించే నాయకులు ఇంత అవినీతిపరులు అయినంతకాలం తెలంగాణా విడిపోతే తెలంగణవాళ్లకి ఒరిగేదేమి లేదు. ఒక రాష్ట్రంలో బదులు రెండు రాష్ట్రాల్లో అవినీతి ఏర్పడుతుందంతే.

- వెల్చేరు నారాయణరావు, విమర్శకులు, షికాగో

నలుగురూ కలిసి నిర్ణయం చేయాలి

ఒకవేళ ఆంధ్ర, తెలంగాణా వేరే రాష్ట్రాలుగా విడిపోతే ఇరు ప్రాంతాల్లో కూడా ఎకనామిక్‌ డెవలప్‌మెంట్‌ వచ్చే అవకాశం ఉంది కదా. పైగా రాష్ట్రం చిన్నదైతే పరిపాలన సులభమవుతుంది. సమస్యలను ఎదుర్కోవడం తేలికవుతుంది. నేడు ఈ పరిస్థితి వచ్చింది కాబట్టి ప్రత్యేక తెలంగాణా నెలకొల్పడం ఒక రకంగా మంచిదేమో? కాని, అది రావడానికని మనం చేపట్టిన రాక్షస మార్గాలు మాత్రం మంచివి కావు. సమస్యలని కూలంకషంగా అర్థం చేసుకొనే రాజకీయవేత్తలు నలుగురూ కలిసి, చర్చలు జరిపి, నిర్ణయం తీసుకున్న తరువాత దాన్ని ప్రజలకు అర్ధమయ్యే తీరులో వారికి చెప్పడం చేయాలి. ఇలా ప్రశాంతంగా సమస్యలను పరిష్కరించుకోవడం మనకు చేతవుతుందా? కష్టమే!

- పూడిపెద్ది శేషుశర్మ, కథా రచయిత్రి, అట్లాంటా, జార్జియా

ఇంటర్వ్యూలు: కల్పనా రెంటాల, ఆస్టిన్‌, టెక్సస్‌


Comments



Name (required)

Email (required)

Website

Speak your mind