- దుర్గం రవీందర్‌

సిరిపురం యాదగిరి (యాదయ్య) ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రవేశద్వారం వద్ద ఫిబ్రవరి 20న ఉదయం పెయికి అగ్గి అంటించుకొని ఆత్మహత్యాయత్నం చేశారు. తెలంగాణ కోసం ఆత్మహత్యాయత్నం చేసుకొంటున్నానని సూసైడ్‌ నోట్‌లో విస్పష్టంగా పేర్కొన్నాడు. అతనిని ఆసుపత్రికి తరలించారు. సాయంత్రం పొద్దు పోయాకా యాదయ్య చనిపోయారు. అదేరోజు అర్ధరాత్రి యాదయ్య మాతృదేహాన్ని ఆయన స్వగ్రామం నాగారం (మహేశ్వరం మండలం) తరలించి వారి ఆచారం ప్రకారం బొందపెట్టారు. తెలంగాణ గ్రామాల్లో పెళ్ళికాని యువతి, యువకులు చనిపోతే బొందపెట్టడం ఆచారం. యాదయ్య చావు ఆచారం ప్రకారమే జరిగిందంటే ఇందులో చర్చించడానికి గాని, ఆశ్చర్యపోవడానికిగాని ప్రత్యేక వ్యాసం రాయడానికిగాని ఏమీ ఉండదు. కాని అలా జరగలేదు. పోలీసులు వారిదైన వ్యూహాత్మక దోరణిని ప్రదర్శించారు.

యాదయ్య ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలను తర్వాత విశ్లేషిద్దాం. ఆత్మహత్యాయత్నం దగ్గర నుండి ఏం జరిగిందో చూద్దాం. యాదయ్య ఆత్మహత్యాయత్నం చేసుకొన్నది యూనివర్సిటి గేట్‌ ముందు. వెంటనే 108 వాహనం వచ్చింది. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో సమీప ఆసుపత్రికి పేషెంటును తీసుకెళ్తారు. ప్రక్కనే అరకిలోమీటరు దూరంలో మమిళా సభ ఆసుపత్రి ఉంది. యూనివర్సిటి అవతలి గేట్‌ దగ్గర ఆర్‌టిసి వారి ఆసుపత్రి ఉంది. రెండు, మూడు కిలోమీటర్ల దూరంలో ఒకవైపు ఉస్మానియా ఆసుపత్రి ఉంది. ఇంకోవైపు గాంధీ ఆసుపత్రి ఉంది. మొదట గాంధీ ఆసుపత్రికి తీసుకెల్తున్నాం అని, ఎక్కడో సాగర్‌ రింగ్‌రోడ్‌ దగ్గర సైఫాబాద్‌ అవతల వున్న డిఆర్‌డిఎల్‌ అపోలో ఆసుపత్రికి యాదయ్యను ఎందుకు తరలించినట్లు? సాయంత్రం యాదయ్యను చూడడానికి హోం మంత్రి సబితాఇంద్రారెడ్డి వచ్చింది. అక్కడ ఉన్న తెలంగాణవాదులు కొందరు ఆమెను నిలదీశారు. ”ఏమిటీ అన్యాయం, ఎన్ని ఆత్మహత్యలు జరుగుతున్నా మీరు పట్టించుకోరా. మీ మంత్రి పదవులే మీకు కావాలా, తెలంగాణ వద్దా” అని వారు అడిగారు. దీంతో ఆవిడ కోపంతోనే అక్కడి నుండి నిష్క్రమించారు. సబితను ప్రశ్నించిన పిరోజ్‌ఖాన్‌ అనే కరీంనగర్‌ విద్యార్థి పోలీసుల చేతిలో పడి సోమవారం సాయంత్రందాక ఆచూకి లేకుండా పోయారు. 20వ తేదీన సాయంత్రం పొద్దు పోయాక యాదయ్య మరణించారు. యాదయ్య మరణ వార్తను సీమాంధ్ర యాజమాన్యంలో ఉన్న మీడియా సహజంగానే పెద్ద ప్రాముఖ్యత ఇవ్వలేదు. హిందూ దినపత్రికలో మాత్రం ఈ వార్త ప్రముకంగా వచ్చింది. సాక్షితో పాటు ఒకటి రెండు పేపర్లలలో ఈ వార్తను ప్రచురించారు. ఆంధ్రాజ్యోతిలో యాదయ్య వార్త లేనే లేదు. సరే అది మీడియా ఎప్పుడూ చూపే వివక్షతనే. ఆయన స్వయంగా అంటించుకున్నాడా, ఇతరులెవరైనా అంటించారా లాంటి అర్థంలేని ప్రశ్నలు అడిగినచో మీడియా ప్రతినిధిని విద్యార్థులు కొట్టినంత పనిచేశారు. వైష్ణవి కిడ్నాప్‌పై స్పందించినట్లుగా యాదయ్య పట్ల మీడియా స్పందించకపోవడంలో వారి వైఖరి తేటతెల్లం అవుతున్నది. అది అలా ఉండగా పోలీసులు ఈ ఘటనలో పరమ దుర్మార్గంగా, అనైతికంగా, చట్టవిరుద్దంగా ప్రవర్తించారు.

సాధారణంగా ఒక వ్యక్తి ఎంతగా కాలినా ఆ గాయాలతో 24 గంటల తర్వాతనే మరణిస్తారు. కాని యాదయ్య 12 గంటలు గడిచి గడవగానే మరణించారు. కారణం తెలువదు. యాదయ్య బ్రతికితే అతను బాగుపడి బయటికి రావడానికి కనీసం రెండు నెలలు అయినా పడుతుంది. ఈ రెండు నెలలు ఆసుపత్రి ముందు టెంట్లు వేసి దీక్షలు చేసి నానా హడావిడి చేస్తారు. నాయకులు పరామర్శించడానికి వస్తారు. దీంతో మీడియా వారి హడావుడి, ఉద్యమకారులగోల ఇవన్నీ ఎందుకని ముందుగానే గుట్టుచప్పుడు కాకుండ ‘యాదయ్య కథకు ఆ రాత్రి ముగింపు పలికితే ఏ గొడవా ఉండదు కదా’ అని పోలీసులు భావించి ఉండవచ్చు. లేదా యాదయ్యనే కాలిన గాయాలతో మరణించి ఉండవచ్చు. అటువంటప్పుడు యాదయ్య శవాన్ని గుట్టుచప్పుడు కాకుండా ఎందుకు తరలించినట్లు? మీడియా వారికి ఎందుకు ఎరుక పరచనట్లు? సాధారణంగా ఎవరైనా ఇలా కాలిన గాయాలతో ఏ ఆసుపత్రిలో మరణించినా పోస్ట్‌ మార్టం చేయడానికి శవాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలిస్తారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి చెప్పినా రాత్రికి రాత్రి పోస్ట్‌మార్టం చేయరుగాక చేయరు. మరి యాదయ్యను రాత్రికిరాత్రి ఆయన స్వంత ఊరికి ఎలా తరలించారు. పోలీసులకు ‘ఈ ఆలోచన’ ముందే ఉంది కాబట్టే యాదయ్యను ఆయన స్వగ్రామానికి వెళ్ళే దారిలో ఉన్న డిఆర్‌డిఎల్‌ ఆసుపత్రికి తీసుకెళ్ళారు. అటునుంచి అటే శవాన్ని మూడో కంటికి తెలియకుండా తరలించారు. 85% కాలిన శరీరంతో ఎలాగు చనిపోయే వాడేకదా అని ముందే ‘ఆ పనికానిచ్చే’ అవకాశం ఉంది. ఈ విషయమై తెలంగాణ వాదులకు తీవ్రమైన అనుమానాలున్నాయి. ఈ ఉద్దేశ్యం ఉంది కాబట్టి యాదయ్యను పోలీసులు డిఆర్‌డిఎల్‌ అపోలో ఆసుపత్రికి తరలించారు అన్నది వారి ఆరోపణ.

యాదయ్య ఎందుకు ఆత్మహత్యకు ఒడిగట్టాడు:

యాదయ్యకు రాజకీయాల పట్ల ఆసక్తి ఉంది. కె.సి.ఆర్‌, సబిత, చంద్రబాబు, తదితరులతో యాదయ్య దిగిన పోటోలు, ఆ విషయాన్ని వెల్లడిస్తున్నాయి. ఆ పోటోలను మార్కుల మెమోలను ఆయాయ గుర్తుగా ఆత్మహత్యాస్థలంలో వదిలాడు. తెలంగాణా విషయంలో రాజకీయ వాదులు చేసిన చేస్తున్నా మోసాలు యాదయ్యకు అర్థమై ఉంటాయి. మిత్రులందరితో కలిసి ”చలో అసెంబ్లీ” కార్యక్రమానికి వద్దామని చెప్పిన యాదయ్య ఆ రోజు ఉదయం ఒక్కడే బయలుదేరి వచ్చాడు. ఆ ముందు రోజు రాత్రి కె.సి.ఆర్‌ లాంటి నాయకులు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం వద్దని విద్యార్థులను నిరుత్సాహపర్చిన సంగతి తెలిసి ఉంటుంది. ఎబివిపి, బిజెపి నాయకులందరు ఎవరికి వీలయిన రీతిలో వారు మాట్లాడటం వల్ల తీవ్ర నిరుత్సాహానికి, నిరాశకు గురయినందునే యాదయ్య ఆత్మహత్యకు ఒడిగట్టాడు. తెలంగాణ రాదనే నిరాశనే యాదయ్యను, ఆత్మహత్యాయత్నానికి పురికొల్పింది. రాజకీయాలపై అంతో ఇంతో అవగాహన ఉన్న యాదయ్య నిరాశతోనే ఆత్మహత్య చేసుకున్నారు. యాదయ్యను యాదయ్య తరాన్ని చావనిచ్చి, చంపి తెలంగాణాను తాత్కాలికంగా ఆపినా ముందుతరం వారు కూడా యాదయ్యలా చస్తారని చెప్పడానికి ఆస్కారం లేదు. యాదయ్య వెనక ఉన్నా ఈ తరం వారు ఇంకోరకంగ రియాక్ట్‌ కారని చెప్పడానికి ఎంతమాత్రం వీలు లేదు.

ఇక యాదయ్య గ్రామం సిరిపురానికి మూడే దారులున్నాయి. ఇందులో రెండు దారులు తారురోడ్డువి. ఈ రెండు దారులను పోలీసులు మూసేశారు. ఆబిడ్స్‌లో ట్రాఫిక్‌ కంట్రోల్‌ చేయడానికి వాడే బారికేడ్లతో సిరిపురం రోడ్లను పోలీసులు మూసేశారు. ఈ బారికేడ్లు సిరిపురంకు ఎలా వెళ్ళాయి? ఊరి నిండ పోలీసులు నిండారు. టీ షర్టులు వేసుకొన్న 20-25 ఏళ్ళ వయసున్న పోలీసులు, కర్నాటక పోలీసులు, సీమాంధ్ర పోలీసులు ఆ ఊరిని స్వాధీనం చేసుకొని, యాదయ్య బంధువులను అదిలించి బెదిరించి యాదయ్య శవాన్ని హడావిడిగ బొందపెట్టేశారు. మీడియా వారిని కూడా వెళ్ళనివ్వలేదు. వెళ్ళిన ఒకరిద్దరు కెమెరాల వారిని అదుపుచేసి బొంద పెట్టే వార్తా దృశ్యాలను అదుపు చేసి ఉంటారు లేదా పోలీసు వారికి ఇబ్బంది లేనివిధంగా చిత్రీకరించుకోనిచ్చి ఉంటారు. విమర్శకులకు సమాధానం చెప్పడానికి అన్నట్లు గద్దర్‌, హరీష్‌, తీగలకృష్ణారెడ్డి లాంటి వారిని ముగ్గురిని అనుమతించారు. పోలీసులు ఇంత దుర్మార్గం ఎందుకు చేస్తున్నారు? క్రింది పోలీసులు వారంతట వారుగ ఇలాంటి పనులు చేయరు. వారికి ఇలాంటి ఆదేశాలు ఇస్తున్నవారెవరు? ఈ ఆదేశాలు ఇస్తున్నవారిని ప్రోత్సహిస్తున్నవారెవరు?

మొత్తం మీద పోలీసులు ఏ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా యాదయ్య శవాన్ని బొందపెట్టేశారు. యాదయ్య శవంతో పాటు తెలంగాణ సమస్యను బొందపెట్టేశం అని కించిత్తు గర్వంగా ఊపిరి పీల్చుకొని ఉంటారు. పోలీసు మంత్రి సబిత, ముఖ్యమంత్రి రోషయ్యలు ఈ విషయాన్ని గమనించనట్లే ఉండిపోయారు?

ఇలా శనివారం ఉదయం పెట్రోలు పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన యాదయ్య రాత్రికి శవమయ్యాడు. ఆధివారం ఉదయం దాదాపు అదేవేళకు బొందపెట్ట బడ్డాడు. అతి సాధారణ రీతిలో, అసాధారణ పోలీసుల బలగాల మధ్య అంత్యక్రియలు జరిగాయి. యాదయ్య నక్సలైట్‌ కాదు కాబట్టి మానవహక్కుల సంఘాలు యాగిచేయవు. యాదయ్య అగ్రకులం వాడుకాదు కాబట్టి వారి కనుసన్నల్లో మెదిలే మీడియా, ప్రజా సంఘాలు ఏమీ మాట్లాడవు. యాదయ్య టి.ఆర్‌.ఎస్‌ నాయకుడు కాదు కాబట్టి వారు ఏమీ మాట్లాడరు.

యాదయ్య తెలంగాణ కోసం ఆత్మార్పణ చేసుకున్నారు. అతని అంత్యక్రియలు కెసిఆర్‌, జయశంకర్‌, కోదండరాం, దామోదర్‌రెడ్డి లాంటి నాయకులు వేసే మొదటి పిడికెడు మట్టితో మొదలుకొని తెలంగాణ విద్యార్థులందరూ వేసే తలో పిడికెడు మట్టితో జరగాలి. అలా వేసిన మట్టి గుట్టగా ఏర్పడాలి. అది జహంగీర్‌ దర్గాలాగా తెలంగాణ వారందరికి పుణ్యక్షేత్రం కావాలి. పాపం యాదయ్య అనామకంగా కొండంత త్యాగానికి పిడికెడు మట్టిని పిసరంత గౌరవానికి కూడా నోచుకోలేదు. తప్పుచేసిన పౌరుడివలే పోలీసుల పహరాలో కననంఅయ్యాడు. యాదయ్య క్షమించు నీ త్యాగానికి దైర్యానికి తగిన చావును నీకు చేయలేకపోయాం!


Comments



5 Comments so far

  1.    Sudhakar on February 23, 2010 7:27 am

    Excellent ..Excellent and simply Excellent.
    The facts in black and white.

  2.    Leo Augustine Manne Dora on February 23, 2010 8:59 am

    hardly able to speak! Of 30 years of my sojourn in politics, civi rights activity advocacy, Telangana movement etc.,I have seen near me and around me & from very close, and seeing many a deaths in encounters custodial,& many other brutal forms, my eyes r blood red as they have lost all the water drained out of crying. I have seen my elders die, my contemporaries and now many young in the name of people, values, 3TELANGANA3 and of all for dignity of LIFE.

  3.    uberVU - social comments on February 24, 2010 2:06 am

    Social comments and analytics for this post…

    This post was mentioned on Twitter by telangana: Don’t Telangana Martyrs deserve respect even in death ??? http://bit.ly/yadaiah...

  4.    praveen kumar on July 23, 2010 1:08 pm

    this is very toomutch.i hate this govet. but he is a inspire person. telangana peoples always says johaar yadayya.. johaar.we will reach our goal…..

  5.    praveen kumar on July 23, 2010 1:12 pm

    READ IN TELUGU– addu vachinavanni champiainaa sare telangananu saadistamu…. swargamlo unna ni atmaku shantini chekurustamu..

Name (required)

Email (required)

Website

Speak your mind