తెలంగాణా ఉప ఎన్నికలు!
June 8th, 2010.
ఉప ఎన్నికలు! తెలంగాణా కోసం రాజీనామా చేసిన వాళ్లకి, తెలంగాణా తెస్తాం , ఇస్తం అని అడుగడుగునా, దశాబ్దాలుగా మోసం చేస్తూన్న వాళ్లకి, తెలంగాణా కోటి ఆశలకి మరియు రాజకీయ స్వలాభాలకి. ఎన్నికలు తెలంగాణాకు కొలమానం కాదు అన్న విషయం ప్రజలకు తెలుసు, అయినా తెలంగాణా పెరుచెపితేనే బతికి బట్ట కట్టారన్న విషయం నిన్న మొన్నటి వరకు గెలిచిన ప్రతి నాయకుడికి తెలుసు, పార్టీలకు తెలుసు . మరోసారి మళ్లీ ప్రజల అవసరం వచ్చి పడింది. ఇన్ని ప్రాణాలు పొయినా, ఉవ్వెత్తున ఉద్యమం నడిచినా పెద్ద లెక్ఖ లోకి రాదు. కేవలం రాజీనామా చేసినా నాయకులను గెలిపిస్తేనే తెలంగాణా సెంటిమెంటు బలంగా ఉన్నట్టు. ఇది అధికార పార్టీలు, అనధికార పార్టీలు ఆడుతున్న నాటకం.
తెలంగాణా ఎపుడూ మాటని నమ్మింది, ఆటను నమ్మింది, పాటను నమ్మింది, రాతను నమ్మింది. అమాయకంగా రాజకీయాలను నమ్మింది. ప్రతి సారి మోస పోయింది. మొసలి కన్నీళ్ళకి ఆహుతి పోయింది. ఇక లాభం లేదని రోడ్డున పడింది, ప్రాణాలు కూడా అర్పించింది. అయినా ఎవరికీ కనికరం రాదు, ఎవరు సామాన్య ప్రజలని ఆదుకొరు, అందరు లేక్ఖల్లో బిజి. నాకేమిస్తవ్, నాకేం తెస్తవ్..తెలంగాణా తెచ్చేది ఇచ్చేది మేమే అనే వాళ్ళని చూస్తె జాలి వేస్తుంది. ఈ గడ్డ మిద ఏ గొప్ప రాజకీయ నాయకుడు ఎవడైనా వుంటే, అది కేవలం తెలంగాణా వల్లనే అనే విషయం తెలియదా లేక పొతే, ఇంకా మజాక్ చేస్తున్నారా అనుకోక తప్పదు. ప్రజలు ఇంకా గొర్రెలు అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఇపుడు మన ముందున్నవి పచ్చి నిజాలు. కాంగ్రెస్ రాజకీయాలు ఒక విషయాన్ని స్పష్టంగా మనముందు ఉంచుతున్నాయి, ఒక వైపు జగన్ లాంటి వాళ్ళని ఉసి కోల్పుతూ, బుజ్జగిస్తున్నట్టు నటిస్తూ, మరో వైపు ఉద్యమాన్ని నీరు కార్చటానికి కృష్ణ కమిటీ నాటకాన్ని నడుపుతూ, చాప కింద నీరులాగా తన పని తాను చేసుకు పోతుందీ. టిడిపి, కాంగ్రెస్ లోని తెలంగాణా నాయకులు వారి వారి పార్టీల నిర్ణయానికి మాత్రమే కట్టుబడి ఉంటామని చెప్పకనే చెపుతున్నారు, చాలామంది బాహాటంగానే ఒప్పుకున్నారు. వీరికి ఏమాత్రం తెలంగాణా పై ప్రేమ లేదు అనడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు. అసలు రాజకీయాలు, అందులో నాయకులకి ప్రజలపై ఎంత చిత్త శుద్ధి ఉందనే చర్చ ఇక్కడ చేయకుండా ఉంటేనే బాగుంటుంది.
తెలంగాణా లో ఎన్నికలే ప్రామాణికం అయితే తప్పకుండ ప్రజలు గెలిపించు కుంటారు. పోలవరం కావాలనే చిరంజీవితో కాంగ్రెస్ పొత్తు, మరి కాంగ్రెస్ తో కొన్ని పార్టీల నమ్మకాలు, ఒప్పందాలు మాత్రం ప్రజలను చాల ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. డి ఎస్ నామినేషన్ కూడా మన వాళ్ళు సమర్ధించడం అర్థం కాక చాల మంది సందిగ్ధం లో పడ్డారు. ఈ పన్నెండు మంది గెలిస్తే తెలంగాణా వస్తుందా అన్న ప్రశ్నకి కూడా జవాబు చెప్పాల్సి ఉంటుంది , మనం . ఇంతకు ముందు చేసినా రాజీనామాలు , ఆ తరువాత ఎన్నికలు , వాటి ఫలితాలు , పరిణామాలు అందరికి తెలుసు. మన అదృష్టం ఏమో కాని, ఎవరు ఎపుడు ఏ రంగు మారుస్తారో తెలీదు. ఎవరి స్వార్థం ఎలా ఉన్నా, చరిత్ర మాత్రం ఒక వాస్తవాన్ని మన ముందుంచింది. తెలంగాణా ప్రజలకు ద్రోహం చేస్తే నామ రూపాలు లేకుండా పోతారని. అయినా, తెలంగాణా ప్రజలు ఎపుడూ జాగ్రత్తగానే ఓట్లు వేసారు, ఇందులో అనుమానం ఏమి లేదు, ఈవిషయం తెలుసు కోవాడానికి ఎవరు ఎక్కువ కష్ట పడక్కర్లేదు. రాజీనామా చేయని వాళ్ళ గతి ఏంటో ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాము, అసలు పని చేయని నాయకుల గతి కూడా చూసాము, ఇక ముందు కూడా చూస్తాము. కొమ్ములు తిరిగిన వారు కూడా తమ ఎత్తుగడలు ఫలించక తోక ముడుచు కోవడం, తెలంగాణా ముందు తలవంచు కోవడం ఇంకా మరిచిపోలేదు . తెలంగాణా బలం ఏంటో అందరికి తెలుసు.
ఇకపోతే, తెలంగాణా సాధించడానికి బ్లాక్ మెయిల్ రాజకీయాలు ఇపుడు అవసరం లేదు, అలాంటి రాజకీయాలు చేయబట్టే అనేక మంది ప్రాణాలు పోగొట్టుకున్నాము అన్న విషయం వాస్తవం. పోరాటమే మార్గంగా ఎంచుకోవాలి గాని, ఆత్మ హత్యలు, హింస, బలిదానాల ప్రసక్తి ఈ ఎన్నికల ప్రచారంలో రాకుండా చూసుకోవడం మన బాద్యత. ఈరోజు విద్యార్థి నాయకులు, ఆవేశంలో ‘మాకు విషం ఇవ్వండి..లాంటి డైలాగులు ప్రజల పైకి వదలడం అంతా మంచి పరిణామం కాదు. ఇంక ఈ చావులు, చంపడాల గురించి మనం చాల జాగ్రత్తగా ఉండాలి. ఆ పరిస్తితి వస్తే ఎవరు ఏమిచేయలేరు కూడా. అన్నవాడు బాగానే ఉంటాడు, విన్న వారికి , ఆవేశ పరులకే బాధ. అది మనం ప్రత్యక్షంగా చూశాము కూడా.
అయ్యా! ఎన్నికల బరిలో ఉన్న ప్రతి ఒక్కరికి దండాలు పెట్టి మరి చెపుతున్నాము, తెలంగాణా ఉద్యమాన్ని ఎన్నికలకి కుదిన్చకండి, ఈ స్వతంత్ర భారత దేశంలో ఎన్నికల్లో గెలవాలంటే నీతి, నిజాయితీ అవసరం లేదు..మద్యం ఏరులై పారితే, నోట్ల కట్టలు చిత్తు కాయితాల్ల ఎగవేస్తే, గుండాగిరి ఉపయోగిస్తే , కులబలాల సమీకరణలతో తోటి గెలవచ్చు. అతి కొద్ది మంది మాత్రమె తమ స్వయం కృషి తో గెలుస్తారు. తెలంగాణా సెంటిమెంట్ మిద గెలిచిన నాయకులు ఎపుడూ వెన్నుపోటే పొడిచారు. అందుకే ప్రజలు మరింత ఆలోచిస్తున్నారు ఇపుడు, ఆచి తూచి అడుగు వేస్తున్నారు . అసలు తెలంగాణా బాద్యత అంతా ఒక వ్యక్తీ మీద, పార్టీ మీద పెట్టడం చాల దూర ద్రుష్ట కరం. ఎంతో మంది మేధావులు ఎన్నో సందర్బాలలో ‘ఉద్యమానికి రాజకీయాలు ఒక పార్శ్వం మాత్రమె ‘ అని ఉద్ఘాటించారు. ఇవాళ ఒక ప్రధాన ప్రతి పక్ష తెలంగాణా నేత ఇంకొక నేతకి ఒక సవాల్ విసిరారు.. కాంగ్రెస్ ని కనుక మీరు ఉప సంహరింప చేస్తే మేము పోటీ చేయము అని. ఆ భాద్యత ఆ ఒక్క నాయకుడే ఎందుకు తీసుకోవాలో, అసలు అడగడానికి ఆయనెవరో , చేయడానికి ఈయన ఎవరో . సీమ ఆంధ్ర నాయకుల చేతిలో కీలుబొమ్మలుగా ఉన్నా ఏ తెలంగాణా నాయకుడైన మనకు ఇపుడు అనవసరం అనిపిస్తుంది. రాజీనామాలు తెలంగాణా సెంటిమెంట్, ఎమోషన్ కి సంభందిచినవైతే వాటికి కట్టుబడి ప్రతి తెలంగాణా వాది ఉండాల్సిందే. లేకపోతె ద్రోహం చేసినా వారి కిందనే జమ కట్టాలి. మన కళ్ళ ముందు ఇన్ని ప్రాణాలు గాల్లో కలిసిన బుద్ధి రాని ఈ ప్రజా ప్రతినిధులని చూసి, ఇన్ని రోజులు దగ్గర తీసినందుకు సిగ్గుపడాలి.
ఒక విచిత్ర మైన సందర్భం నేడు , ఇపుడు పాడిన మద్యం పాటలు అత్యధికంగా ప్రభుత్వానికి ఆదాయాన్ని తెచ్చిపెట్టినాయి. అనేక మంది రాజకీయ నాయకుల, గుండాల ఆద్వర్యంలో జరిగాయి. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మాత్రమె ఇలా అయి ఉండొచ్చు అని స్వయంగా ఎక్సైసు అధికారుల విశ్లేషణ. దాదాపు యాభై వేలవరకూ టెండర్లు, కొట్లలో ఆదాయం. ఏ ప్రాంతంలో ఎంత అమ్ముడు పోతుందీ అని లెక్ఖ కాదు, ఎన్నికల్లో ఎంత వరకు ప్రజలను మత్తులో ముంచొచ్చు అనేదే లెక్ఖ. కోటీశ్వరులకు, రాజకీయ నాయకులకు మాత్రమే అర్థమయే విషయం.
ఇక్కడ ఎవరు గెలిచినా ఓడినా, తెలంగాణా వాదం ఉన్నట్టు, లేనట్టు అనుకోవడం మాత్రం ఉద్యమాన్ని కించ పరచడమే అవుతుంది. మీ రాజకీయాల్లోకి అమాయక ప్రజలను లాగవద్దని మాత్రమె విన్నపం. గెలుపు ఓటములు నాయకులకి , పార్టీలకి కాని, ఉద్యమానికి కాదు. తెలంగాణా మంట ఎపుడూ మండుతూనే ఉంటుంది, గుండె రగులుతూనే ఉంటుంది. కేవలం కొద్ది సమయం, ఇంకొద్ది సమయం కావాలంతే..
సుజాత సూరేపల్లి
Articles | Comment (0)మార్చ్ 8 తెలంగాణా మహిళ దినోత్సవం
March 8th,2010,Karimnagar
అంతర్జాతీయ మహిళా దినోత్సవం , శతాబ్ది సంవత్సరం! వెనక్కి తిరిగి చూసుకుంటే మహిళలు అన్ని రంగాల్లో పైకి వచ్చినట్టు కనిపిస్తున్నా, వారి పై జరిగే హింసలో పెద్దగా మార్పులు లేవు, హింస రూపాలు మారుతూ వస్తున్నాయి గాని జీవితాలలో పెద్దగా మార్పు లేదు. ముఖ్యంగా పేద దేశాలలో మహిళల పరిస్తితి దారుణంగా ఉంది. ఒక వైపు అనాదిగా వస్తున్నా ఆచారాలు, మరోవైపు పేదరికం, రాజ్య హింస స్త్రీలను కష్టాల ఊబిలో నెట్టి వేస్తున్నాయి. నిజానికి మహిళా భాగస్వామ్యం లేకుండా ఎ ఉద్యమాలు లేవు ప్రపంచంలో. హక్కుల కోసం, వనరుల కోసం, విద్య, వైద్యం కోసం అనేక దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నారు మహిళలు. వారి పేర్లు ఎక్కడా వినపడవు, కనపడవు, ఎక్కడో కొంత మంది రాజకీయాలలో ఉన్న మహిళల గురించి మాత్రమె ప్రపంచానికి తెలుస్తుంది కాని మారు మూల గ్రామాల్లో అడవులలో పోరాటం చేసే స్త్రీల గురించి బయట ప్రపంచానికి తెలియకపోవడం నిజంగా ఆలోచించ దగ్గ విషయం.
జనాభా పెరుగుతూ , విప్లవ భావజాలపు మొదలైతున్న రోజులు అవి, దాదాపు 1900 వ సంవత్సరం నుండి అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నారు. 1908 వ సంవత్సరం న్యూయార్క్ నగరంలో మహిళల ఓటు హక్కు కోసం , వేతనాలు, పనిగంటలు తగ్గించాలని దాదాపు 1500 మంది మహిళలు ర్యాలి నిర్వహించారు. ఆ తరువాత 1909 వ సం” అమెరికా socialist పార్టీ , ఫిబ్రవరి 28 న మొట్ట మొదటి జాతీయ మహిళా దినం ప్రకటించింది. 1910 కోపెన్ హెగెన్ లో అంతర్జాతీయ మహిళా కాంగ్రెస్ సమావేశం నిర్వహించారు. అందులో ఉమెన్స్ ఆఫీస్ నాయకురాలు అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఒకే రోజు ప్రతి దేశం లో తమ డిమాండుల సాధన కోసం, హక్కుల కోసం మహిళలు ఉద్యమించడానికి నిర్వహించాలని ప్రతిపాదించారు.దీనికి 17 దేశాల ప్రతినిధులు, మహిళా సంఘాలు, ముగ్గురు ఫిన్నిష్ మహిళా ప్రతినిధులు ఆమోదం తెలిపారు. ౧౯౧౧ సం” లో ఆస్ట్రియ, డెన్మార్క్ , జర్మనీ, స్విట్జర్లాండ్ దేశాలు మార్చ్ 19 న మహిళా దినోత్సవం జరుపుకున్నారు. సుమారు లక్ష మంది మహిళలు హక్కులు, పని గంటలు, వేతనాలు, వోటు హక్కు, అణచివేతకు వ్యతిరేకంగా రాలి నిర్వహించారు. ఆ తరువాత జరిగిన ‘triangle ఫైర్’ లో ౧౪౦ మంచి జువిష్, ఇటలి వలస వచ్చిన మహిళలు బలి అయ్యారు. దీనికి అంతర్జాతీయంగా తీవ్ర వ్యతిరేకత వచ్చింది. 1913 -1914 ‘బ్రెడ్ & పీస్’ తరపున రష్యా యుద్ధం లో మరణించిన రెండు లక్షల మంది సైనికుల కొరకు నిరస తెలిపారు. 1918 -1999 సోసియలిస్ట్ ఉద్యమంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం అధిక ప్రాధాన్యతను సంతరించుకుంది. దీనికి ప్రతి సం” మద్దతు పెరుగుతూ వచ్చింది.
ఆతరువాత 1975 , ఐక్య రాజ్య సమితి మార్చ్ 8 న అధికారికంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రకటించింది. 2000 ల సం” నుండి చైనా, అమెరిక, రష్యా, అజర్బైజాన్, బెకరాస్, బల్గేరియా, కజకిస్తాన్, కిర్గిస్తాన్, మసేదోన, మోల్డోవా, మొంగోలియా, తజకిస్తాన్, ఉక్రెయిన్, ఉజ్బెకిస్తాన్, వియత్నాం దేశాలలో అధికారిక సెలవు దినం గా ప్రకటించాయి. మగవాళ్ళు వారి తల్లులకి, భార్యలకి, స్నేహితులకి, సహోద్యోగులకి అభిననదనలు తెలిపే ఆచారం అమలవుతు వచ్చింది.
మారుతున్న కాలంతో పాటు, హక్కులపై, స్త్రీల పట్ల అవగాహన పెరుగుతూ సమాజంలో కొన్ని మార్పులు జరుగుతూ వచ్చాయి. ప్రభుత్వ విధానాల్లో కూడా మార్పులు తప్పని సరి పరిస్తితి అయింది. మహిళలు అనేక రంగాలలో తమ ప్రతిభను చూపుతూ, అన్ని రకాల అడ్డంకులను అధిగాముస్తూ ముందుకు సాగుతున్నారు. పితృస్వామిక భావజాలం బలంగా ఉన్న సమాజాలలో మహిళల పరిస్తితిలో పెద్దగా మార్పులు లేవు. ఇంకా రాజకీయ, వ్యాపార, క్రీడా రంగాల్లో మహిళల పాత్ర కొద్ది శాతంగానే ఉంది. శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఇపుడిపుడే మహిళలు ముందడుగు వేస్తున్నారు.
ఇక తెలంగాణా మహిళల పరిస్తితి చాల దయనీయంగా ఉంది, ముక్య్హంగా గ్రామీణ ప్రాంతాల్లో. ఒక వైపు సమాజంలో మహిళల పట్ల చిన్న చూపు, వరకట్నం, బాల్య వివాహాలు, అణచివేత, మరో వైపు తీవ్ర మైన రాజ్య హింస. తమ బ్రతుకులు బాగు పడడానికి మహిళలు ఉద్యమించక తప్పని పరిస్తితి. వీరి చైతన్యం పెరుగుతున్న కొద్ది, అణచివేత రూపాల్లో మార్పులు కలుగుతూ వస్తున్నాయి, దీనికి తోడూ, కుల వివక్ష్యత, ప్రాంతీయ వివక్షత కు మహిళలు ఇంకా బలి అవుతూనే ఉన్నారు. తెలంగాణా గడ్డ ఉద్యమాలకి మారు పేరు. ఇక్కడి చరిత్ర, సంస్కృతీ, వనరులు ఎపుడూ దోపిడీకి గురి అవుతూనే ఉన్నాయి. ఇక్కడి స్త్రీలు రాజకార్లకి వ్యతిరేకంగా , సాయుధ పోరాటంలో పాల్గొన్నారు, ఈ గడ్డ పై సమ్మక్క సారలమ్మ వారసత్వం, చాకలి ఐలమ్మ వీరోచిత పోరాటం ఉంది. వీరితో పాటు ఆరుట్ల కమలమ్మ, గజ్జెల బాలమ్మ, వజ్రమ్మ, ప్రియంవద, జమాల్ ఉన్నిసా బాజీ, రజియ బేగం ఇంకా అనేకమంది స్త్రీలు పోరాటం చేసారు. విప్లవోద్యమంలో అమరులైన బెల్లి లలిత, రేణుక జ్ఞాపకాలు నేటికి వెంటాడుతూనే ఉన్నాయి. రాజకీయాల్లో సదాలక్ష్మి, ఈస్వరిబాయి, మల్లు స్వరాజ్యం తదితరులు ధైర్యంగా ముందుకు నడిచారు. ఈ మహిళలు తమ వారసత్వాన్ని నేటి తరానికి అందించారు, నాటినుండి నేటి వరకు జరుగుతున్న తెలంగాణా విముక్తి పోరాట బాటలో అనేక మంది రచయిత్రులు, కళాకారులు , గృహిణులు ముందున్నారు . ఈ చరిత్ర అంతా ఎపుడూ వివక్షతకి గురి అవుతూ, మరుగున పది ఉంది. ఇంతటి ఉద్యమ చరిత్ర ఉన్న ఈ గడ్డ మిద, ఇంకా మహిళల పై హింస కొనసాగుతూనే ఉంది. నేటి పాలమూరు వలసలు, అడవి తల్లులు, బొగ్గుగనుల తవ్వకాల్లో మసి అవుతున్న ఆడవాళ్ళు కోకొల్లలు. అభివృద్ధి పేరుమీద విపరీత మైన హింస చోటు చేసుకుంటుంది. ఈ పది జిల్లాలలో మహిళలు తమ జీవితాలకోసం, భూమి కోసం, నీరు కోసం, సమన హక్కుల కోసం ఉద్యమిస్తూనే ఉన్నారు.
కరీంనగర్ జిల్లా స్త్రీలపై హింసకు మారు పేరుగా ఆంధ్ర రాష్ట్రంలో ముందుంది. ఇందుకు కారణం ఆంధ్ర పెత్తందారి వలస పాలకులేనని , తమ జీవితాలు తెలంగాణతో ముడి పడి ఉన్నాయని ఇక్కడి మహిళల నమ్మకం. ఉద్యమంలో ప్రానలర్పిస్తున్న తమ పిల్లలను తలచుకొని మరింత క్షోబకు గురు అవుతున్నారు ఇక్కడి మహిళలు. ఉపాది లేక ఇక్కడి మగవారు గల్ఫ్ బాట పట్టి జీవితాలను ఫణంగా పెడుతున్నారు, ఓపెన్ కాస్ట్లు, క్వారీ దోపిడీ, ఇసుక దోపిడీకి పర్యావరణం విపరీతంగా దెబ్బతింటూ జలవననరులు అడుగంటి పోతున్నాయి, వ్యవసాయం పై ఆధారపడ్డ దళిత, ఆదివాసి, బహుజన మహిళల బాధలు వర్ణనాతీతం. ఒక వైపు సామాజిక వతిది, మరోవైపు ఆర్థికపరమైన హింస.ఈ కరీంనగర్ గడ్డ మీద , నేటి అంతర్జాతీయ శతాబ్ది దినోత్సవాన్ని స్పూర్తిగా తీసుకొని ‘తెలంగాణా మహిళ దినోత్సవంగా’ జరుపుకునేందుకు నిర్ణయించుకున్నారు. తమ చరిత్రలని తామే తిరగ రాసుకుంటూ, తెలంగాణా రాష్ట్ర సాధనకోసం మహిళలందరూ ఏకమై పోరాడాలని ముందుకు సాగుతున్నారు. ఇప్పటినుంచి మార్చ్ 8 తెలంగాణా మహిళ దినోత్సవంగాప్రకటిన్చుకుంటున్నారు.
జోహార్లు తెలంగాణా అమరవీరులకు!
సుజాత సూరేపల్లి
Articles | Comment (0)గులాబీ ముళ్ళు గుచ్చుకొంటయ్
24th March,2010
గులాబిలు ఉన్నాయి
ముళ్ళూ ఉన్నాయి
పడిలేచే ఆవేశ కెరటాలున్నాయి
ప్రతి ఆలోచనను అణగదొక్కే ఖాకీలున్నాయి.
ఉవ్వెత్తున ఉద్యమిస్తున్న యువతరం ఉన్నా
నిప్పులై మండుతున్న నిజాలున్నా
మనోల్ల ముసుగులో తోడేల్లు తిరుగుతున్నయి
ఆయుధం లేకుండానే అరాచకం శ్రుస్టిస్తున్నైయ్.
పసి పిల్లల ప్రాణాలు తోడేస్తున్నయ్
తల్లి తెలంగాణకి తీరని అన్యాయం తలపెడుతున్నయి
ప్రతి అడుగులో మోసం, అణువణువునా దగా
భయంతో కంపిస్తున్న జనం
నీడను కూడ నమ్మలేని వైనం
రెండుగా చీలుతున్న భూమిలో
సమాధి అవుతున్న మంచితనం.
విముక్తి మార్గం ఎపుడూ
ప్రశ్నించే స్పూర్థితో కదులుతుంది
వెచ్చని రక్తంతో తడుస్తుంది
ఓటమితో జడవక మరొకమారు
దిక్కులను చీల్చుకొంటూ కొత్త కాంతిని వెదుకుతుంది
ముళ్ళ కంచెలను దాటుకుంటూ
శత్రు తీపి మాటల వలలని చేదిస్తూ
విజయ పధం వైపు నడుస్తుంది..
వ్యయాన్ని లెక్కించక పోరాడి గెలుస్తుంది..
సుజాత సూరేపల్లి
Articles | Comment (0)మనం ఎటువైపు ?
2nd April, Karimnagar
ఐక్య కార్యాచరణ కమిటి! జే ఏ సీ ‘జాక్’ ఉస్మానియా విద్యార్థులతో ప్రారంభమై, కొద్ది రోజుల్లో అడవి మంటలా మారుమూల ప్రాంతాల దాక పాకిన కమిటీలు. కేవలం తెలంగాణా అనే ఒకే ఒక అజెండాతో ఏకమై ఏర్పడ్డ ఐక్య కార్యాచరణ కమిటీలుగా వీటిని అభివర్ణించారు ఎందరో. ఇదే నిజమైన ఆశాజ్యోతి తెలంగాణ భవిషయత్తుకు అనుకొన్నారు మరికొందరు. మరోమారు 1969 పునరావృతమైందన్నారు ఇంకొందరు. తమ తమ అస్తిత్వాలని కాపాడుకుంటూ ముందుకు వచ్చిన సంఘాలన్నీ ఉవ్వెత్తున తెలంగాణా నినాదాన్ని ఊరూరా వాడవాడలా ప్రదర్శించిన కమిటీలు. రాజకీయ పార్టీలను, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను గడ గడ లాడించిన కమిటీలు. చివరికి తెలంగాణ నామస్మరణలో, తెలంగాణకు ఎవరో మరోమారు మోసం చేసారని గొంతెత్తి దీర్ఘాలు తీయడంలో పోటీలు పడుతున్న రాజకీయ పార్టీలను కూడా నిలదీసిన కమిటీలు. తెలంగాణ రాజకీయాలను స్వార్థనాయకులు మరోమారు మోసం చేయకుండా చెక్ పెట్టగలవని కొందరు అనుకొన్న కమిటీలు.
కొద్ది రోజుల ముందు ఏ పార్టీలను, కులాలను, మతాలను, సిద్దాంతాలను పక్కకు పెట్టి ముందుకువొచ్చాయో అనుకొన్న కమిటీలు పేకమేడల్లా కూలిపోయినాయి. ఇది నిజము. ఒక దశ దిశా లేకుండా అదృశ్య శక్తుల ప్రేరణతోనో ఉద్వేగంతోనో కదిలే, రగిలే కమిటీలుగా ఈరోజు మన ముందు ఉన్నాయి. ఈ కమిటీలు ఈరొజు సరిగా లేవని నిన్న గొప్పగా ఉన్నాయనేవాళ్ళు కొందరు. ఇవ్వాళ వాటి స్వరూపం లక్ష్యమూ ఏమిటో నిన్న కూడా అదే అంతకు భిన్నంగా ఎలా ఉందగలదని అడిగేవాళ్ళు కొందరు.
అయితే తెలంగాణా అంశం ఒక్కటే కాకుండా తమ స్వార్థ ప్రయోజానాలకి వాడుకునేటట్టు మలచబడి కొద్ది రోజుల్లోనే పలచబడి చివరికి కొందరికి తొత్తులుగా ఏర్పడే స్థితికి వచ్చాయి. ఎక్కడ ఐక్యత కనపడితే అక్కడ చీలిక అనివార్యం, మరో శిబిరం, వారి వెనుక ఎవరి హస్తమో, ఎవరి ఆలోచనలో రాజ్యం ఏలుతు ఉంటాయి. చివరికి దానికి రక రకాల పేర్లు పెడతారు. ఒకరు రైట్ అంటే మరొకరు లెఫ్ట్ అంటారు, లేకపోతె పార్టీల , సిద్దాంతాల పరంగా, కులాల పరంగా విడిపోతుంటారు. ఎవరు ఎటుపోయినా కూడా ఎవరు ప్రజల అభిప్రాయాలను గౌరవిస్తున్నారు అనేది ముఖ్యం. ఇప్పటి వరకు జరిగిన మోసాలను, వెన్నుపోట్లను సమీక్షించు కుంటూ , తెలంగాణను మోస పుచ్చిన పార్టీలకు దూరంగా ఉండడమనేది అవసరం. చేసిన తప్పులనే మళ్ళీ చేస్తూ పొతే మాత్రం మళ్ళీ మోసపోయినట్టే.
ఈసారి తెలంగాణ అన్న ప్రతి పార్టీనీ, దాన్ని సమర్థించే ప్రతి మేధావిని, సిద్ధాంతకర్తని ఆ పార్టీ స్పోక్స్ పర్సన్ ని , అ పార్టీకి అంకితమైన గాయకున్ని, రచయితని అడగాల్సిందే. ఓ అన్నా, ఓ అక్కా నువ్వు నిజంగా తెలంగాణ కోసమే చెప్తున్నావని, మాట్లాడుతున్నావని , పని చేస్తున్నావని నిన్ను ఎందుకు నమ్మాలే, ఎట్ల నమ్మమంటవు అని అడగాల్సిన సమయము వొచ్చింది. ఎవరు చెప్పలేదు తెలంగాణ కోసము ఎన్ని త్యాగాలైన చేస్తామని? ఎన్ని పార్టీలు ఇతర పార్టీలపై సవాళ్ళు విసరలేదు? ఎవరు నిజమైన తెలంగాణావాడు ఎవడు నకిలి నిజముగా పెద్ద గందరగోళమే. నమ్మిన వాడే గొంతుకోయడానికి ఎక్కువ అవకాశముంది. అదీ నిజమే.
తెలంగాణ వచ్చుడో ఒక నాయకుడు సచ్చుడో అన్న నాటినుండి ఏ పార్టీ ప్రత్యేక రాష్ట్రం ఇస్తుందా అని దేబురించక ఒక సారి ఉద్యమం ద్వారానే మన రాష్ట్రానికి సన్నాహాలు జరుగుతున్నాయి అని అనుకొన్నాము. ఈ మధ్య తెలంగాణ నామస్మరణవల్లనే జనాన్ని మోసగించొచ్చని నెలలు కాదు సంవత్సరాలు ఇపుడు దశాబ్దాలుగా కూడా ఇలానే ఆటలాడుకోవచ్చు అనుకొనే పరిస్థితి మారిందనుకొన్నాము. రాజకీయ పార్టీలు కాదు ఈరోజు, ప్రజల చేతుల్లోకి ఎల్లి పోయింది తెలంగాణ అని టీ ఆర్ ఎస్ చిదంబరానికి ఈ మధ్య చెప్పినపుడు, అట్లైతే మీరెందుకొచ్చిండ్లు చేతులూపుకుంట అని ఎదురు ప్రశ్నించినపుడు జాక్లు ఇంకొద్దని, అన్ని రాజకీయ పార్టీలు నిర్ణయించుకొన్నై. నయాన బయాన జాక్ల దుకాణం మూసేయండని చెప్పాయి. ఉద్యమము మొదలయ్యింది.దగా కోరుల ఉద్యమం ఆగిపోయింది, నిజమైన తెలంగాణా ప్రజల గొంతును అనచివేయబడే ప్రయత్నం జరుగుతుంది. అయినా కొద్దిమంది, కొన్ని కొత్త గా ఏర్పడే జాక్ లైనా సరే , విడిపోయి మిగిలిన జాక్ లైనా , నిస్వార్థం గా ప్రజల కోసం, తెలంగాణా కోసం పరి తపిస్తూనే ఉన్నాయి. అయితే ఈ చీలికలు ఎలా, ఎవరి సైగలతో జరుగుతుంది ? ఇలా జరిగేలా జాక్లెందుకు ఒప్పుకొన్నాయి అనేవి లోతుగా ఆలొంచించాలి.
ఇప్పటి వరకు విద్యార్తుల ద్వారానే ఉద్యమం ఎంతోకొంత ముందుకు పోయిందనేది వాస్తవం. అదే విద్యార్ధులని మన రాజకీయ పార్టిలు జలగల్లాగా పట్టి పీడిస్తూ వారిని ఎన్ని రకాలుగా ప్రలోభ పెట్టాలో అన్నిరకాలుగా ప్రయత్నిస్తూ తమకు అనుకూలంగా మలచుకుంటున్నాయి. స్వచ్చందంగా తమ భవిష్యత్తు కోసం, తెలంగాణా ప్రజల బాగు కోసం, నాలుగు కోట్ల ప్రజల విముక్తి కోసం విద్యార్తులు ఉద్యమాలు చేస్తుంటే వారిని విడగొట్టడం ఎంతవరకు సబబు? ఇలా విడగొట్టే వారికి ఏది శిక్ష? దీనిని ద్రోహం అనాల లేక తమ తమ అస్తిత్వాలని కాపాడుకోవాడానికి డివైడ్ అండ్ రూల్ సిద్ధాంతాన్ని, తెలంగాణా ఉద్యామాన్ని కూడా ఫణంగా పెట్టి తమ అసలు స్వరూపాలని బయట పెట్టుకుంటున్నారు అని అనుకోవాలా, ఎలాగయినా అర్థం చేసుకోవచ్చు.
ఎవరు అవునన్నా, కాదన్నా రాజకీయ పార్టీలు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కొరకు, ప్రజా సమస్యల పై ఉద్యమాలు చేయవు అన్నది వాస్తవం, వారికి పార్టీల అజెండా తప్పితే ప్రజల గురించి, వారి సమస్యల గురించి పట్టించుకున్న పాపాన ఏనాడు పోలేదు. నిజంగా రాజకీయ పార్టీలు తెలంగాణా సమస్యలు పట్టించుకొని ఉంటె ఇవాళ పరిస్థితి ఇంత దౌర్భాగ్యంగా ఉండేది కాదు. తెలంగాణ ప్రజలను ఆంధ్రా దోపిడిదార్ల కుట్రలకు, పథకాలకు, ప్రాజెక్టులకు బలిచేస్తుంటే పెదవి విప్పని తెలంగాణ నాయకులు విద్యావంతులు మొన్న డిసంబరు నుంచి మార్చి మధ్య ఇది బాగుంది అది బాగలేదని విపరీతంగ బాధపడుతున్నరు. ఎందుకూ ఇంత సడనుగా పెరిగిన తెలంగాణ ఉత్సాహమని ఎవరికైనా సందేహం రాక మానదు.
రోజుకో మాట మాట్లాడే హక్కు తమకే ఉన్నదనీ, రోజుకొకరితో పొత్తుపెట్టుకొని ఇంకొకరితో విడిపోయి గందరగోళం చేసే హక్కు తమకే ఉన్నదనీ, త్యాగాలెన్నైనా చేస్తామని అమయాక పిల్లలను రెచ్చగొట్టిన పార్టీలన్ని, ప్రాణాలను కాదుగదా పదవులను సైతం వదులుకోలేక దొంగ రాజీనామాలివ్వటం కూడ తమకే చెల్లునని, పది సార్లు నిలదీస్తే తప్ప ఒకసారి చెల్లే రాజీనామాలు ఇవ్వలేని పార్టీలు మళ్ళీ వోట్లబేరానికి వొస్తున్నయి. మేమంటే మేము నిజమైన తెలంగాణ పార్టీలమని గుండెలు బాదు కొంటున్నాయి.
తెలంగాణ ప్రజలను నట్టేటా ముంచినా, మేమంటే మేము ఇంకొకడికంటే ఎక్కువ జపం చేసామని పోటీపడుతున్నరు. పైగా ఇలాంటి రాజకీయ పార్టీలను గెలిపించుకునే బాద్యత మాత్రం మల్లొకసారి ప్రజలదే అంటున్నారు. చరిత్ర ఎపుడూ పునరావృతం అవుతూనే ఉన్నది, ప్రజలు ఎప్పుడు మోసపోతూనే ఉన్నారు. మనం మాత్రం ప్రేక్షక పాత్ర వహిస్తూనే ఉన్నాము. వాస్తవాలను చెపితే మనకు అనేక రకాలుగా పేర్లు పెడుతుంటారు. అయినా కూడా మన బాద్యత విస్మరించకుండా ఉన్నది ఉన్నట్టు మాట్లాడు తూనే ఉన్నాము.
విద్యార్థులను చెడగొడుతున్న వారెవరైనా (టీ ఆర్ ఎస్ గాని ఇంకే పార్టీ ఐనాగానీ), ఉద్యమాన్ని మోసపుచ్చుతున్నరనే అనుకోవాలి, ఉద్యమాన్ని తమ అవసరాల కోసం తమ లావాదేవీల కోసం పెంచడము అవసరం తీరిందనుకొంటే చల్లార్చడము. ఇట్లా చేయడము నేరమనే చెప్పాలి. ఇవి నేటి ఉద్యమంలో ఉన్న విషయాలు, వాస్తవాలూ. డబ్బు సంచులని, పదవులని ఎరగా చూపుతూ ఉద్యమ స్పూర్తిని ప్రక్క దారి పట్టిస్తున్న వారిని మాత్రం ఎట్టి పరిస్తితిలోనూ క్షమించడానికి వీలు లేదు. నిన్న ప్రళయం సృష్టిస్తామని నేడు మౌనమైపోయి మల్లొకసారి వోట్ల ఫక్కీలోకి తిరిగి వస్తున్నామనే వాళ్ళకు బుద్ది చెప్పాల్సిందే. ఇక్కడ యుద్ధం జరుగుతుంది, ఆత్మ గౌరవ పోరాటాలు జరుగుతున్నాయి. నీతికి అవినీతికి మధ్య, అణచివేతకి వ్యతిరేకంగా, అన్యాయానికి వ్యతిరేకంగా ప్రాణాలు కూడా లెక్ఖ చేయకుండా త్యాగాలతో ఉద్యమం నడుస్తుంది. శత్రువు ఎవరో తెలియకుండా ముందుకు పోలేము.ఏది తెలుసుకోకుండా , అమాయకంగా చీకట్లో బాణాలు వేయలేము, మరిన్ని ప్రాణాలు , ఆశలు, కోరికలు బలి పెట్ట లేము.
ఈ సారి జరిగిన ఉద్యమంలో అసువులు బాసిన వాళ్ళంతా ఈ మోసాలకి బలి అయినా వాళ్ళే. ఇవన్నీ రాజకియ హత్యలే. ఇందులో ఎ పార్టీకి ఎంత వాటా ఉందనేది విజ్ఞులు తేల్చాలి. ఈ హత్యలు ఆగాల్సిందే, ఈ విషయాలు చర్చించాల్సిందే. తెలంగాణ రాజకీయాలు భవిస్యత్తు పట్ల నమ్మకాన్ని కాక నిరాశను , నిస్సహాయతను పెంచేదిగానున్న దౌర్భాగ్య పరిస్థ్తినుంచి దిశ మరాల్సిందే. ఈ ఆత్మహత్యల పరంపర ఇక కొనసాగొద్దు అని అనుకొనే ప్రతిఒక్కరు నేటి రాజకీయాల నిజాయితిని నిబద్దతనీ ప్రశ్నించాలి. అలాకాక ఇప్పుడు మనం స్వార్థరాజకీయ నాయకులకు తలవంచితే ఇన్ని చావులను అవమాన పరచడమే అవుతుంది. ఇప్పుడున్నవన్ని బూర్జువా పార్టీలు, ప్రజల క్షేమం కోరే ఒక్క పార్టి కూడా లేదు. ఏ రాయి అయితే ఏముంది, ఏ పార్టి అయితే ఏముంది, ఏ నాయకుడు అయితే ఏముంది, ప్రజలకు ఒరిగింది మాత్రం శూన్యం.
ఉద్యమాలు చేయకుండా, మల్లొకసారి వోట్లనడిగేందుకే రాజీనామాలు చేసినా ప్రయోజనం లేదు, రాజినామాలు చేయని వారికంటే చేసిన వాళ్ళు గొప్ప అని ఎవరైనా అంటే, నాలుగు రోజుల గడువుతో మల్ల పదవులకు తన్లాడడమే గొప్పా లేదా నాయకుడు రాజీనామ చేయడుగాని మిగితా వాళ్ళు చేస్తే చాలా అని ప్రత్యర్థులు అడిగితే జవాబేది? ఏది అర్హత? అది ఇపుడు ఎవరికుంది? ఉద్యమాల ద్వారానే అనేక కమిటీలు, ఒప్పందాలు. ఉద్యమాల ద్వారానే డిసంబర్ తొమ్మిది ప్రకటన వచ్చింది అన్నది వాస్తవం. ఆంధ్రా వలసపాలకుల మౌళిక ప్రయోజనాలను ప్రశించకుండా మాటవరసకు తెలంగాణ జపం చేయడము వలన, స్వప్రయోజనాలకు , కుటుంబ ప్రయోజనాలకోసము దేనికైన వెనుకాడని నాయకుల చేష్టలవల్లా, చీలికలు, కుట్రలు కుతంత్రాల వల్ల అనేక అమాయక ప్రాణాలు బలి అవుతున్నాయి, అవుతాయి అన్నది ఇంకొక పచ్చి నిజం. ఉద్యమాంకి మరో సారి వెన్ను పోతూ తప్పదు.
ఆత్మహత్యలు ఆపాలన్నా, తెలంగాణా సాధించాలన్నా, ఇప్పటికైనా, మనమందరం ఇష్టమున్నా లేకున్నా ద్రోహులను ద్రోహుల్లాగా ప్రకటించి, ప్రజల పక్షాన నిలబడడం, ఉద్యమాన్ని బలోపేతం చేయడం ఒక్కటే మనముందున్న కర్తవ్యమ్. ఏదో ఒకటి అన్నాడులే మనకోసము అని ప్రతి అవకాశవాదిని క్షమించు కుంటూ పొతే, మనల్ని మనం మోసం చేసుకుంటూ మరోసారి దగాపడ్డ ప్రజలని, తెలంగాణని చూస్తూ మౌనంగా ఉండి పోవడమే. ‘నువ్వు అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడాక పొతే, తప్పకుండా అన్యాయాన్ని చేసే వాడివవుతావు’ అన్న మాటలను మనం మరచి పోకూడదు.
ఒక్కసారి ఆలోచించడి, మనం ప్రజల వైపా? పార్టీల వైపా ? మన నిర్ణయాలే ఉద్యామానికి బలం. మన న్యాయ బద్దమైన ఆలోచనలే మనకు గెలుపుకు దారి చూపిస్తాయి. ఇపుడొక ప్రత్యామ్నాయం అవసరం. . ఆచరించే ఆచరణాత్మక మాటలతో మాత్రమె ప్రజలకు పనికొచ్చే నిజమైన ప్రజాస్వామిక తెలంగాణాని సాధించు కోవచ్చు.
ఆలస్యం విషం!
మనం ఎటువైపు ?
సుజాత సూరేపల్లి
Articles | Comment (0)ప్రజలే న్యాయ నిర్ణేతలు
14th April, 2010, Karimnagar
తెలంగాణా జాక్ ల సమన్వయ స్టీరింగ్ కమిటీ ! తెలంగాణా ఉద్యమ కమిటీ, విద్యార్తుల కమిటీ, ప్రజా, కుల సంఘాల కమిటి. అనేక కొత్త జాక్ లు ఉద్యమాల గురించి మాట్లాడుతున్నాయి. అసలు తెలంగాణా ఉద్యమం అంటే ఏమిటి? ఎందుకు అపుడు అరవై తొమ్మిది లో మరి ఇపుడు ఇన్ని ప్రాణాలు కోల్పోయాము అని ప్రస్నించు కోవాల్సిన సందర్భం. దేనికోసం ఆరాటం, పోరాటం? ఇది బ్రతుకు కోసం కాదా? ఆత్మ గౌరవ కోసం కాదా? పోగొట్టుకున్న , పోగొట్టుకుంటున్న వనరులు, ఉద్యోగాల గురించి , భాష సంస్కృతీ గురించే కదా? నిజమే రాజకీయ పరిష్కారమే తెలంగాణాని ఇస్తుంది ? ఇన్ని ఏళ్లుగా రాజీ లేని పోరాటం చేస్తున్నా రాని పరిష్కారం , ఉద్యమ రూపం తీసుకున్నాకనే రాజకీయాలు వేడెక్కాయి కదా? రాజకీయ పార్టీలు కూడా ఇపుడు ఉద్యమమే మార్గం అని తేల్చి చెప్పి , ఉద్యమం మొదలు పెట్టిన తరువాతనే ఇంతవరకు వచ్చింది అనేది పచ్చి నిజం కాదా?. ఈ రాజకియ చదరంగంలో కొన్ని వందల సంఖ్యలో అమాయక ప్రాణాలు బలి అయి ఉండవచ్చు, ఎన్నో వేల ఎకరాల భూములు, నీరు, సహజ సంపద తరలి పోయి ఉండొచ్చు, వాటిపై ఆధార పడ్డ బడుగు, బలహీన వర్గాలు రోడ్డున పడి ఉండొచ్చు, వీటికోసం నిరంతరం శ్రమించి అజ్ఞాతంగా కృషి చేసిన వాళ్ళు హత్యలకు గురి కావొచ్చు. ప్రజలు ప్రతి రాజకీయ పార్టీని నమ్మారు, వారి వ్యూహాత్మక మౌనాన్ని అర్థం చేసుకున్నారు, అనేక రాజకీయ ఎత్తుగడలని పరిశీలించారు , కనీసం తెలంగాణా రాక పోయినా జరిగే నష్టాన్ని ఆపుతారేమో అని ఊహించారు. కాని అలా జరగలేదు. గత్యంతరం లేక , ఇక వేచి చూస్తె కనీసం చస్తే బొందపెట్టే జాగా కూడా దొరకదేమో అని భయపడి, మళ్ళీ తెలంగాణా బాధ్యతని భుజాన వేసుకొన్నారు, మరొక్కసారి ఉవ్వెత్తున ఎగిసి పడిన ఉద్యమాన్ని నీరు కార్చే ప్రయత్నాలు చూడలేక మరో ప్రత్యామ్నాన్ని వెదుకుతూ ఉన్నారు. వాటి ఫలితమే అనేక రకాలైన జాక్ లు పుట్టుకు రావడము. అయితే ఎవరు నిజంగా ఉద్యమ బాటలో పయనిస్తున్నారు అనేది మరొక ముఖ్య విషయం. నిజానికి ఒకరో ఇద్దరో సంఘాలు, జాక్ లు తప్పితే తెలంగాణా ఉద్యమం గురించి పెద్దగా ఆలోచించడం లేదు. కేవలం ప్రకటనల తోటి , కాలయాపనలు చేస్తూ, తమ ఉనికిని కాపాడుకునే పనిలో పడ్డాయి. ఏ ఒక్కరి దగ్గర ఖచ్చితమైన ప్రణాళిక లేదు, ప్రజలను ఏకం చేసి, ఉద్యమ శక్తులను కలుపుకొని పయనించే పని జరగటం లేదు.
ఈ మధ్య కాలంలో ఏర్పడిన ఒక జాక్ ల సమన్వయ కమిటి కి గద్దర్ ముందుండి నాయకత్వం వహిస్తున్నారు. ఏమిటి ఈ జాక్ చేస్తున్న ప్రయత్నం అని అనేక మంది ఉత్సాహం చూపెడుతున్నారు. అనేక రకాల ఉద్యమ శక్తులను ఐక్యం చేస్తూ ముదుకు పోదామని పిలుపుని ఇచ్చారు. ముక్యంగా నాలుగు అంశాలతో ఈ వేదిక ఏర్పడినది. ఒకటి గ్రామా స్తాయినుంచి కమిటీలు వేసి ఉద్యమాన్ని బలోపేతం చేయటం, విద్యార్థులు మరియు తెలంగాణా వాదులపై పెట్టిన కేసులను ఎత్తి వేయడం, కృష్ణ కమిటీని వ్యతిరేకిస్తూ ఉద్యమాల ద్వారానే తెలంగాణా సాధ్యం అని ప్రకటించారు. రాజీనామాలు, కమిటీలు నమ్మని ప్రజలు ఈ జాక్ వైపు మొగ్గు చూపుతున్నారు. జిల్లాల్లో ఉన్న సమస్యల పై పని చేయడం కూడా ఇందులో భాగం. అయితే ఈ క్రమంలో తెలంగాణలో ఉన్న అన్ని పార్టీలను, నాయకులను కూడా విమర్శించారు. ఇక్కడే వచ్చింది చిక్కు అంతా. మనవాడు దొంగైన, దొర అయినా మనోడే అనాలన్నది సిద్దాంతం. మరి కాళోజి గారు ఎపుడో చెప్పారు ప్రాంతం వారే ద్రోహం చేస్తే ప్రాణంతో పాతి పెట్టమని. గద్దర్ కూడా అదే చెపుతున్నారు, అయన కాస్త ఒక అడుగు ముందుకు వేసి, రాజకీయ పార్టీలని ఉద్యమ బాటలో నడవ మంటున్నారు. ఇంకా సమయం మించి పొతే ఇక తెలంగాణా వచ్చి కూడా లాభం లేదు కూడా. ఇపుడున్న పొలిటికల్ జాక్ కి గద్దర్ ని నాయకత్వం వహించమని అడిగినపుడు , ఆయనొక ఉద్యమ కారుడు, యుద్ధ నౌక, కళా కారుడు, కాని అయిన అడిగిన ప్రశ్నలకి పొలిటికల్ జాక్ వద్ద సమాధానాలు లేవు. ప్రజలతో కలిసి ఉద్యమాలు చేయడానికి వారు సిద్ధంగా లేరు. ఎలా ఉంటారు? అనేక లావా దేవిలలో మనవారి వాటా కూడా ఉంటుంది కదా, ఈ విషయం ప్రజలకు తెలియదు అనుకుంటే పొరపాటే. అనివార్య పరిస్తితిలో ఈ కొత్త జాక్ అవసరం ఏర్పడినదని అయన చెప్పుకుంటూ వచ్చారు. ఒకసారి అయన పొలిటికల్ జాక్ తో కలిసి పని చేయ నిరాకరించారు కాబట్టి ఇపుడు అయన ఒక మావోఇస్టు, ఉద్యామాన్ని పక్క దారి పట్టిస్తున్నారని ప్రచారం, ఎర్ర రంగు పులుముతున్నారని మేధావులు, పోలిసుల ఉవాచ. ఆయనతో కలిసి పని చేసే వారెవరైనా ఇపుడు తీవ్రవాదులే అన్న ముద్ర వేయడానికి ప్రయత్నాలు జరుగు తున్నాయి.
కాని వారు తీసుకున్న ఉద్యమ స్వరూపం అనేక మందికి ఉత్సాహాన్ని కలిగిస్తోంది. కనీసం జిల్లాల్లో అయన సమస్యల పై పోరాడుతాను అన్న ఒకే ఒక్క విషయం ఆ ప్రాంత ప్రజలను కదిలిస్తుంది. ఇపుడు ఇక్కడ ఉన్నది ఎర్ర కలరా, పచ్చ కలరా, ఇంకేదైనా కలరా అన్న విషయాన్ని పక్కకు పెడితే, తెలంగాణా కొరకు పని చేస్తున్నారా లేదా అనే అంశం పై ప్రజల మద్దతు ఉంటుంది. తెలంగాణాకు పని చేయాలంటే కేవలం ఒక జాక్ మాత్రమె మంచిదని, వారి విధానాలే శిరోధార్యమని భావించడం, మిగిలిన వారికందరికీ ఏదో ఒక కలర్ పూయడం మాత్రం విడ్డూరం. ఉద్యమ బాట పట్టినపుడు మంచి చెడులు బేరీజు వేసుకోవడం అవసరం, సద్విమర్శలు కూడా అవసరమే, అంత మాత్రం చేత విమర్శించే వారందరినీ ద్రోహులుగా చిత్రించడం మరో సారి ప్రజా ఉద్యమాలకి ద్రోహం చేయడమే. నిన్నటికి నిన్న కరీంనగర్ జాక్ ల సమన్వయ కమిటి సభలో సమస్యల పై పోరాడుతూ తెలంగాణను సాధిద్దాం అని అక్కడి ప్రజలు పిలుపుని ఇచ్చారు. అత్యంత ప్రజా స్వామికంగా అనేక మండలాల నుండి వచ్చిన జిల్లా ప్రతినిధులతో కమిటి వేసుకున్నారు. అవగాహన పత్రం, సభ తీర్మానాలు అక్కడికక్కడే ప్రకటించారు. అందరు వారి వారి అభిప్రాయాలను, అభ్యంతరాలను వెళ్ళబుచ్చారు, రావలసిన, కావలసిన సమాధానాలను వెతుక్కున్నారు. జిల్లాలో జరుగుతున్న ఇసుక, రాయి, ఓపెన్ కాస్ట్లు , గల్ఫ్ బాదితులు,ఆదివాసీ సమస్యలు, స్తానికులకు ఉద్యోగాలు , అడుగంటుతున్న భూగర్భ జలాల గురించి చర్చించారు. ఉద్యమ ప్రణాళిక తయారు చేసుకున్నారు. మరుసటి రోజే అక్కడి కలెక్టరు, ఒక ప్రజా ప్రతినిధి , విద్యా శాఖ మంత్రిగారు దగ్గరలో ఉన్న ఒక ఊరికి వెళ్లి అక్కడ జరుగుతున్న అభివ్రుది ప్రణాలికలని ప్రజలకి వివరించారు. ముఖ్య విషయం ఏమిటంటే వారు వెళ్ళిన వూరు ఉద్యమ ప్రణాళికలో ఉన్న ఒక ఊరు. ఒక సభ ద్వారా యంత్రాంగాన్ని కదిలించ గలిగారు అన్న వాస్తవాన్ని మనం గుర్తించాలి ఇక్కడ . అదే ఉద్యమ రూపం మరియు ఉద్యామాలకు ఉన్న బలం. నిర్బంధాలు, అక్రమ కేసులు కూడా మొదలవుతాయి అది వేరే సందర్భం. ఈ ఉదాహరణ ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ప్రజలను మమైకం చేస్తూ, స్థానిక సమస్యలను కలుపుకొని పోరాటాలు చేస్తే తెలంగాణా తప్పకుండా వస్తుంది. కనీసం వనరుల దోపిడీ అయినా ఆప గలుగుతాము. ఇన్ని రోజులు ఎంతో మంది ఈ విషయాన్నీ ప్రస్తావించారు కాని ఎవరు పట్టించుకోలేదు. కనీసం ఇప్పటికైనా కళ్ళు తెరిచి అందరు ఒక తాటిపైకి వస్తే , ఇప్పడి వరకు ఆత్మ బలిదానాలు చేసుకున్న వారికి కొంత విలువ ఇచ్చిన వారం అవుతాము. మనతో వస్తే మంచి, మనల్ని విమర్శిస్తే చెడు అన్న ధోరణిలో కాకుండా, ఎవరు ప్రజలతో కలిసి పని చేయాలనుకుంటున్నారు , ఏ విధంగా చేయాలనుకుంటున్నారు అనేది ఇక్కడ అవసరం. మనం ఎవరము ఎవరికీ ఏ కలర్ ఎవ్వక్కర్లేదు.ప్రజలే న్యాయ నిర్ణేతలు. వారే రేపటి తెలంగాణా బతుకు చిత్రాన్ని రూపొందించే వాళ్ళు. రేపు ఇంకొన్ని జాక్ లు వచ్చినా, మన ఆలోచనలు ఎటువైపున ఉన్నా, ప్రజలు, ప్రజా సమస్యలు మాత్రమె తెలంగాణని నిలబెట్టకలవు. ఇలాంటి వారినందరినీ ఆహ్వానిద్దాం , వీలయితే కలుపుకొని పోదాం, లేదంటే విడిగా ఉద్యమాలు చేద్దాం. ఏ దారి ఎటు పొయినా, అన్ని దార్లు తెలంగాణా వైపే అయితే మంచిది. నడవరా ముందుకు, అటు , ఇటు , ఎటో వైపు.
జై తెలంగాణా!
సుజాత సూరేపల్లి
–
Articles | Comment (0)దగా పధం
May 6th, 2010.
దగా పడ్డ తెలంగాణలో ‘ప్రజా పధం’, పధకం ప్రకారం వల పన్ని, ప్రజలను బిచ్చగాళ్ళుగా చేసిన పధకం. ఏమిటి ఈ ప్రజా ప్రతినిధులు చేస్తూన్న కార్యక్రమం? ఒక వైపు దశాబ్దాలుగా అణచివేయబడ్డ ప్రజలు, తమ ఆకాంక్షలను ఉద్యమ రూపంలో ప్రాణాలను అర్పిస్తూ , నిరసనలను ప్రకటిస్తుంటే, మరోవైపు కీచక రాజకీయాలు తమ పని తాము చేసుకుంటూనే పోతున్నయి. తెలంగాణా ఉద్యమం తెరపైకి వచ్చాక కాని ఒక్కో రాజకీయ పార్టీ నిజస్వరూపం కానరాలేదు. ఒక పార్టీ రెండు నినాదాలు, రెండు ప్రాంతాల ప్రతినిధులు, ఒక రాష్ట్ర ప్రభుత్వ పార్టీ మరొకటి కేంద్ర ప్రభుత్వ పార్టీ, ఒక పార్టికి రెండు కళ్ళు ఉంటాయి, ఒకటి ఆంధ్ర మరొకటి తెలంగాణా. ఇంకొక ఆయనకి సామాజిక తెలంగాణా అని ఓట్లు దండుకుని ఇపుడు ‘అక్కడ’ ప్రజల అభిప్రాయాల మేరకు సమైక్య ఆంధ్ర గా మార్చుకున్నాడు, పైగా పోలవరం కోసం ప్రచారం మొదలు పెట్టాడు..ఇదే ఇక్కడి రాజకీయ దౌర్భాగ్యం , రాజకీయాల్లో ఓనమాలు కూడా దిద్దని వారు ,ప్రజలకు నాయకత్వం వహిస్తారు, అసలు ఆదివాసీలు, అటవీ హక్కులు, వారి నమ్మకాలు, ఆచారాలు , అంతరాష్ట్ర సంబంధాలు, నీళ్ళ పంపకాల గురించి ఏమి తెలియని ఒక సినీమా హీరోకి ఇలాంటి యాత్రలేన్డుకో అర్థం కాదు .. ఇక్కడ తెలంగాణ ప్రజలు , తమకు న్యాయం జరగటం ఇక కల్ల అని, తమని తామే తప్ప ఇంకెవరూ కాపాడలేరని తమ భుజాల మిద తెలంగాణా విముక్తి జెండాని వేసుకుని ఎడతెరపి లేని పోరాటం చేస్తున్నారు. ఎలాగైనా ఈ పోరాటాలని ఆపాలని, ప్రజలను మభ్య పెట్టటానికి కొంత మంది నాయకులు యాత్రల బాట పట్టారు. ఒకరు ఒదార్పు యాత్ర అని, మరొకరు బస్సు యాత్ర అని తమ ఉనికిని చాటి చెప్పటానికి ప్రయత్నిస్తున్నారు. నేడు ఓ అధికార పార్టి ఆంధ్రా పెద్దమనుషులకి తల ఒగ్గి కనీసం తెలంగాణా నాయకుల అభిప్రాయాన్ని కూడా చెప్పడానికి వీలు లేకుండా, పార్టీ అంతా ఒకే తాటి పై నడవాలని ఆదేశాలిచ్చారు, దానికి తెలంగాణా నాయకులు ఏ మాత్రం సంకోచం లేకుండా ఒప్పుకున్నారు. ప్రాంతాల వారిగా విడిపోయి, ఒక పార్టీ , ఒక మాట కాకుండా, ఒక ప్రాంతం ఒక వాదం గా ఉన్న నాయకులు ఇపుడు, అంతా ఒకే మాట అంటున్నారు. ఒకే మాట అంటే, ఒక ప్రాంతం వారి పెత్తనానికి తల వంచడం అని అర్థం చేసుకోలేనంత పిచ్చి వారు తెలంగాణలో ఇంకా ఉన్నారనుకొనే ఈ అమాయక రాజకీయాలు చూసి అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. తెలంగాణా అంటే కేవలం ఓట్లు అని, ఇక్కడ ప్రజలు, వారి సమస్యలు కానేకావని కొన్ని పార్టీలు వారి వారి లేక్ఖల్లో మునిగి తేలుతున్నాయి.
ప్రజా పథంలో ఉవ్వెత్తున ఎగసిపడుతున్న నిరసన గళాలని, నిర్లజ్జగా అణచివేయ చూస్తున్న ప్రజా ప్రతినిధులు, పోలిసుల ప్రవర్తన చూస్తుంటే, ఈ దేశంలో ఎక్కడైనా న్యాయం, హక్కులు మాట్లదాడానికి వీలు ఉందా, అసలు ప్రజలు ఎపుడైనా వీళ్ళకి ఒక బాధ్యత గల పౌరులుగా కనిపిస్తారా అన్న అనుమానం వస్తుంది. ఏమిటి వీళ్ళు చెప్పదలచుకున్నది? దళిత, బహుజన, ఆదివాసిల భూములను, సెజ్జులని, మైనిన్గులని, మెగా ప్రాజెక్టులని లాగి వేసుకుంటూ, మీరు కూలి వాళ్ళుగానే బతకమని ఉపాధి ఎర చూపిస్తూ, నీళ్ళని కూడా, సారా వ్యాపారంలాగా మారుస్తూ, గుళ్ళను, బళ్ళను మింగేస్తు, ప్రభుత్వ ఆసుపత్రులను, విద్యార్థులను ఆంధ్రా వ్యాపారాలకు అమ్మేస్తున్న పధకాలకి ఎలాంటి ఆదరణ ఉంటుందని అనుకుంటున్నారు వీళ్ళు? కనీసం రేషను కూడా ఇవ్వ చాత కాక, బోగసు కార్డుల ఏరివేత పేరుతో, అనేకమంది పేదల కడుపు కొడుతూ న్యాయం అని మాట్లాడుతున్నారు. అడిగిన వారిని, అడ్డొచ్చిన వారిని అరెస్టులు చేస్తూ, విచక్షణ రహితంగా లాఠి చార్జి చేస్తూ తూ తూ మంత్రంగా తమ పని తాము చేసుకుంటూ పోతున్నారు. బ్రతకటానికి ఇన్ని రోజులు కనీసం నీళ్ళు, చెట్టూ పుట్టా, పంట పొలాలు ఉండేవి ఇక్కడి పేద ప్రజలకు కాని ఇపుడు ఎటూ దిక్కు తోచని పరిస్తితిలో పల్లెలు విలపిస్తున్నాయి. ఓట్లు, సీట్లు, రాజకీయాలు ఏమి తెలియని ప్రజలు, రోజు ఎలా గడుస్తుందనే బెంగలో మునిగి తేలుతున్నారు. తమ సమస్యలకి పరిష్కారం కేవలం తెలంగాణా అని , అన్నింటికీ తెగించి ఉద్యమ బరిలోకి దిగారు. ఇక్కడ ఒక బలమైన నాయకుడు, నాయకురాలు కాని, అండగా నిలిచే కార్మిక సంఘాలు, కుల సంఘాలు కాని తమని అక్కున చేర్చుకొనే పరిస్తితిలో లేరని, ఎవరి గోల వారిదే అనే జ్ఞానాన్ని సంపాదించుకున్నారు. ఇంకా తెలంగాణా పల్లెల్లో ఉద్యమ వాతావరణం కనిపిస్తూనే ఉంది , కొంత మంది స్వార్థ నాయకులు ప్రజలని విడదీస్తున్నా కూడా అక్కడక్కడా కార్మికులు, కర్షకులు, ఉద్యోగులు, యువత, మహిళలు తెలంగాణా కొరకు నిరంతరం శ్రమిస్తూనే ఉన్నారు. ముక్యంగా నీటి కోసం,నీతి కోసం, జాతి కోసం, భూమి కోసం, భుక్తి కోసం ఒక్కటై నాయకులను నిలదీస్తూనే ఉన్నారు. ధూమ్ దాంలు జరుగుతూనే ఉన్నాయి, జాక్లు పుట్టుకొస్తూనే ఉన్నాయి, కృష్ణ కమిటీకి రిపోర్టులు పోతూనే ఉన్నాయి. రాజకీయ పావులు కదులుతూనే ఉన్నాయి. అన్ని దార్లు తెలంగాణా వైపే. అంతర్యుద్ధాలు జరుగుతాయని హెచ్చరికలు జారి చేయడం ఇపుడు అతిశయోక్తి కాదేమో. అపుడు, ఇపుడు కూడా, నాయకులు తెలంగాణకు వెన్ను పోటు పొడిచారు కాని, ప్రజలు ఎపుడూ ఒడి పోలేదు, నిరంతరం ప్రజల హక్కులకు మరియు రాజకీయ సమీకరణాల మధ్య సంఘర్షణ జరుగుతూనే ఉంది.
నిజంగా ప్రజా పధం, ప్రజల కోరకా , చేతకాని ప్రభుత్వాల కొరకా, కోరికా అన్నది ఇపుడున్న సందేహం కాదు నిజం. ప్రాజెక్టుల సెగలు, నీటి ఎద్దడి, ఇసుక, క్వారీ , భూ కబ్జాలు అడ్డూ అదుపూ లేకుండా ప్రభుత్వ అనుమతుల ద్వారానే జరుగుతుంటే, ఏమాత్రం వ్యతిరేకత వచ్చినా, అరెస్టులు, కేసులు పెడుతూ, విప్లవ కారులని , మాజీలని పేర్లు పెడుతూ ప్రజలను, ఉద్యమాలను అణచి వేస్తున్న పరిస్తితులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఒక ప్రాంత ప్రజలు ఉద్విగ్నాల మధ్య, ఉద్వేగాల మధ్య పోరాటం చేస్తుంటే , ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా ‘దగా పదాలను ‘ ప్రదర్శిస్తూ మరో సారి వారి నైజాన్ని బయట పెట్టుకుంటున్నారు. ఎవరు అవునన్నా, కాదనా, ఎన్ని ఎత్తులు, పై ఎత్తులు వేసినా, ఈ తెలంగాణా మంట చల్లారదు అనేది వాస్తవం.. ఇపుడు నివురు కప్పాలని చూస్తున్నా , ఏదో ఒక రోజు దావానలంలా వ్యాపించక మానదు. ఇన్ని హత్యలో, ఆత్మా హత్యలో కాని ఫలితాలను చూడకుండా వాళ్ళ ఆత్మకు శాంతి లభించదని తెలంగాణా ప్రజల అభిప్రాయం. ఇప్పటికైనా ప్రజల వద్దకు వెళ్ళేటపుడు నిజాయితీగా తమ వైఫల్యాలను చర్చిస్తే, ప్రజల అవసరాలకు తగ్గట్టుగా , వారి భాగస్వామ్యంతో పధకాలను రూపొందిస్తే ఇకముందైనా ప్రజలు ప్రభుత్వాలను నమ్మే అవకాశాలుంటాయి. ముక్యంగా ప్రజల మనోభావాలను గమనించకుండా , అణచివేసే ప్రయత్నాలను విరమిన్చకుండా ప్రజా ప్రతినిధులుగా కొనసాగడానికి అనర్హులు.
–సుజాత సూరేపల్లి
Articles | Comment (0)నాకు ఆదర్శం
April 19th, 2010.
కంచే చేను మేస్తుంటే
కంటి రేప్పే కన్నును మింగేస్తుంటే
గుప్పెడు గుండె కుదిపేస్తుంటే
నీడే నిన్ను కమ్మేస్తుంటే
కాలం కలవర పెడుతుంటే
దిక్కు తోచక ఎటో పరుగెడుతున్నావ్
బాధలు, కన్నీళ్లు, కష్టాలు, దగా, మోసం
అన్నిదిక్కుల ఎదురైతుంటే , ఎదిరిస్తుంటే
చెదిరిన గూడు నిలదీస్తుంటే,
కుంగిన భూమి ప్రశ్నిస్తుంటే
ఎండిన నేల బేలగా నీ ఎదురుగ నిలబడితే
ఏది నీకు దారి..
నువ్వు నమ్ముకున్న సిద్ధాంతం
నీకు తప్ప ఎవరికీ అర్థం కాదు
అది ఒక ఆర్తిల్లోంచి , ఆర్తనాదంలోంచి
ఆదర్శం నుంచి మొలకెత్తిందని
మట్టిని మనిషిని కాపాడుతుందని
కళ్ళూ , మనసు లేని ఈ ప్రపంచానికి
ఆదిపత్యం , అణచివేతకి అర్థం తెలియని పిడివాదులకి
ఎట్లా అర్థం చేపిస్తావ్
ఇరాక్ యుద్ధంలో కుప్పకూలిన జీవితాలకు తెలుసు,
శ్రీలంక పులులకు తెలుసు,
క్యూబా స్వతంత్ర వీరులకు తెలుసు
జపతిస్త లో జంగు చేస్తూన్న ప్రజలకు తెలుసు
నీ భయాలు , భావోద్వేగాలు ..
చికట్లోంచి వెలుగుని నింపే నీ ప్రయత్నం
నీ ప్రాణం ఫణంగా పెట్టి
నీ ఆలోచనలను బాణాలుగా
ఎక్కు పెట్టి ,
నువ్వు నడిచే ఏ తొవ్వ అయినా
నాకు ఆదర్శం
సేచ్చా స్వాతంత్రాలకు మార్గదర్శం
–సుజాత సూరేపల్లి
Articles | Comment (0)కోయి బాత్ నహి భాయ్!
May 22nd, 2010.
రాజకుమార్ మల్లి ఓడిపోయిండు
రాజ కుమారుడు గెలుస్తుండు
తెలంగాణా కోసం కళ్ళు కాయలు
కాసేటట్టు చూసిండు ..
జెండాలెత్తి అలసి పోయిండు
ధర్నాలు జేసి పిచ్చోడయిండు
తెలంగాణా ఇస్తమని చెప్పినోనేన్క
తెలంగాణా తెస్తమని అన్నోనేన్క
అలసి పోకుండా తిరిగిండు
అమాయకంగా నమ్మిండు
తల నరుక్కుంట
నాలుక్కోసుకుంట అన్న
ప్రతోన్ని పానంగా
చూసుకుండు..పోద్దువోని పోరగాడు
పొద్దు తిరుగకుండానే
రాలి పోయిండు
తెలంగాణా రాలే కాని
తెస్తన్నోని తీరుజూసి
తెల్లార కుండానే పోయిండు
కమీటులోచ్చినాయని భయం భయం గా
గుండె చేతుల బట్టుకొని
మల్ల ఏమ్మాయ చేస్తారో అని
గుండె పగిలి సచ్చిండు
వాడు వీనేంక
వీడు వానేంకా
ఇచ్చేతోడేవడో తెచ్చేతోడేవడో
ఆర్చేతోదేవడో తీర్చేతోదేవడో
తమ్మి! తన్లాడి తన్లాడి
తనువు చాలించిండు
యాదయ్య , శ్రీకాంతులు
ఎంతమంది చస్తేంది
నువ్వు నేను భాయి భాయి
అనేతోన్ని చూడలేక
యాడికో పోయిండు
కోయి బాత్ నహి భాయ్
అవుర్ తోడ కీంచో
అవుర్ ఏక్ పతంగ్ కాటేగి
హం తో రహేంగే హమేషా
సాహి సలామత్
ఇన్షా అల్లా
తెలంగాణా నామ్ పర్!
సుజాత సూరేపల్లి
Articles | Comment (0)రాజు వెడలె..
రాజు వెడలె.. అవును, డబ్బున్నోడిదే రాజ్యం, పదవి ఉన్నోడికే పలుకుబడి..ఓదార్పు యాత్ర, దానికి హంగులు , ఆర్బాటాలు..ఎవరేమన్నా, అవునన్నా, కాదన్నా..నేను అన్న మాట కి తిరుగు లేదు. మోఇలి గారు మందలిస్తారు, రోశయ్య గారు, తమకు ఇష్టం లేకున్నా అదనపు పొలిసు బలగాలను పంపిస్తారు..రాష్ట్ర పొలిసు యంత్రాంగం అంతా జగన్ యాత్ర కోసమే..సున్నితం గా, బాధ గా, భయంగా ఉన్న ప్రజలతో మాకు పని లేదు..ప్రాణాలు పొయినా పరవాలేదు, మా తండ్రి గారి కోసం చనిపోయిన వారిని పలకరించాలి అంతే. ఒక జాతీయ పార్టి, పేరు ప్రతిష్టలు ఉన్న పార్టి, దానికి ఒక అది నాయకురాలు, ఆవిడ కింద ఎంతోమంది చిన్న పాటి నాయకులూ.. ఎవరి మాట ఖాతరు చేయ వలసిన పనిలేదు, నా రూటే వేరు, సెపరేటు..పార్టిలో సీనియర్ నాయకుల సలహాలతో పనిలేదు, నేనంటే నేనే..నాకు ఒక వర్గం, ఒక గ్యాంగ్, అధిష్టానం తో నాకు పనిలేదు..ఏలినవారు కూడా మౌనంగా ఉంటారు మరి..అవును డబ్బు సంచుల మాయలో పడి, వందల కొద్ది ప్రాణాలు లెక్ఖ చేయని వారికి, ఒక దిక్కారం ఏపాటిది.. ఇక ఎలాగు వినట్లేదు కాబట్టి , పేరు ఓదార్పు యాత్ర, దానికోసం శాంతి, శాంతి కోసం అనేక మంది అరెస్ట్లు , కాపలాలు..ఇక్కడ కొంత మంది సురేఖలుంటారు, తెలంగాణా చచ్చినా, బతికినా, నా రాజకీయ గురువు, అతని పుత్రుడి కంటే ఎక్కేవ కాదు అని తమ్ముళ్ళ బలి దానాలు లెక్ఖ చేయకుండా దండాలు పెడుతుంటారు, స్వామి భక్తి! ..తెలంగాణా కొరకు పదవులు , ప్రాణాలు త్యాగం చేయము కాని, ఒక నాయకుడు, తెలంగాణా, రక్త మాంసాలు అమ్ముకు తిన్న వాళ్ళ కొరకు త్యాగం చేస్తాము..మా భక్తి ని కించ పరిచే వారు ప్రజలు ఎలా అవుతారు? అక్క గొంతెత్తి , తెలంగాణా తమ్ముళ్ళ ప్రాణాల సాక్షిగా, శవాల తివాచీల మిద నడిచి రమ్మని ఆహ్వానం పంపుతున్నది. ఇంకొక నాయకుడు, కాస్త ఆలోచిద్దాం, ఇపుడే తొందర పడొద్దు అని రాజకుమార్ ఆత్మ మిద ప్రమాణం చేసి చెపుతాడు. నిన్నటి వరకు దూషించిన ప్రాంతం, నేడు సభా ప్రాంగణం అయింది..నేను అక్కడికి పోవచ్చు..నువ్వు ఇక్కడికి రావొచ్చు..నా దగ్గర ప్రానాలోడ్చిన నేల తల్లి ఉంది, రాక్తాలతో తడచిన మట్టి ముద్ధలున్నాయి..ఆవేశం తట్టుకోలేక, బాధను అనచుకోలేక గాల్లో ఎగిరే ప్రానాలున్నాయి..నీ దగ్గర, డబ్బు దాహం, అహంకారం, అణచి వేతలున్నాయి..పరవాలేదు, రెండూ ఒకటే..నా యాత్రకు నువ్వు అడ్డు రాకు, నీ యాత్రకు నేను అడ్డు రాను.. గోరేటన్న చెప్పినట్టు రావొచ్చు పోవొచ్చు, యాత్రలెన్నో చేయొచ్చు..
అంతర్గత సమావేశాలు చాలు, ఒక నాయకుడికి అధిష్టానం ఎంత జడుస్తుందో తెలుసుకోవడానికి..కొద్దిగా గొంతు పెగుల్చుకొని ఒకరిద్దరు ఇక్కడి ప్రాంతం చాల ఉద్విగ్న వాతావరణంలో ఉంది, ఇపుడు రావొద్దు అని రహస్యంగా డిల్లి లో గుస గుస లాడతారు. యధా తండ్రి, తథా పుత్రా! నాన్న గారి అడుగు జాడలలో నడుస్తారు..ఎవరికీ ఏ భాష అర్థం అవుతుందో బాగా తెలుసు, ఆ భాషలోనే సమాధానం చెపుతారు. భయం, భక్తి, లాబీలు, ఓట్లు, డబ్బు సంచులు, గుత్తాది పత్యాలు..ప్రాంతభిమానాలు..వెరసి నేటి రాజకీయాలు. ఒక యాత్రని అడ్డుకోలేని వాళ్ళు, అధిష్టానాన్ని ఒప్పిస్తామని ప్రగల్భాలు పలుకుతుంటారు..తెలంగాణా ప్రజలు నమ్ముతుంటారు..ఎన్ని ప్రాణాలు గాల్లో కలసినా, ఎన్ని భూములు దేవతా వస్త్రాల్లా మాయమైనా, ఎన్ని నీళ్ళు అడుగంటినా, దారి మల్లినా..లక్షల కొలది పాలమూరులు వలసలు పోతున్నా, పల్లె పల్లె న పోలేపల్లిలు కుప్పలు తెప్పలుగా పుట్టుకొస్తున్నా, ఖనిజాలు, గనుల పేర్లతో రాళ్ళు రప్పల్ని కూడా మిగలకుండా చేస్తున్నా, శ్రీకాంత చారిల దేహాలు కళ్ళ ముందు మండుతున్నా..మారెదేమి లేదు, పోయేదేమీ లేదు..జైత్ర యాత్రలు కొందరివి, ఓదార్పు యాత్రలు ఇంకొందరివి, సహ్రుద్భావ యాత్రలు మరికొందరివి..పోరాటాలు మాత్రం ప్రజలవి, అలుపెరుగని పోరాటాలు..అంతు చిక్కని మనో వేదనలు..
అసలు ఎవరిని ఎవరు ఒదార్చాలిపుడు? అధిష్టానం, మొయిలి ని ఒక యువ నాయకుడు లెక్ఖ చేయనందుకు భాద పడుతున్న కేంద్రాన్నా లేక ఒక్కరు కూడా మాట వినట్లేదని లోలోపల కుమిలి పోతున్న రోశయ్యనా? రోజు రోజు కో దిగజారి పోతున్న పరువుని కాపాడు కోవడానికి పోలవరం లేక్ఖలు కూడా తెలియని నాయకులు, ప్రచారం చేసుకోవాడానికి ప్రజలే ఓదార్పు తెలుపుతున్నారు కదా.దశాబ్దాల కొద్ది పోరాటాలను చుసిన తల్లి, ఎపుడూ ఏ ప్రాణం పోతుందో అని బిక్కు బిక్కు మంటున్న ప్రాంతం, కోట్ల కొద్ది భాగ్ఘున మండుతున్న గుండెల్ని ఎవరు ఒడార్చాలి..తెలంగాణా చూసి కాని చావను అంటున్న తాతల్ని ఎవరు ఓదార్చాలి..
తెలంగాణలో అంతా ఓర్పే, సహనమే అనకుంటే పొరపాటే సుమా! ఎపుడూ మోసపోతున్దనుకుంటే కూడా గ్రహ పాటే..తిరగబడ్డ తెలంగాణని ఒక్క సారి తలచు కుంటే, గాండ్రించిన తెలగానని ఊహించుకుంటే..ఇక జీవితాంతం ఓదార్పు యాత్రలె!
సుజాత సూరేపల్లి
Articles | Comment (0)జగన్నాటకం!
పాల్ మృత్యువుతో పోరాడుతున్నాడు ! షబ్బీర్ అలీ మానుకోట లో కేరోసిన్ పోసుకున్నాడు, నాగరాజు బ్లేడ్ తో గొంతు కోసుకున్నాడు, కోట్ల మంది తెలంగాణా ప్రజలు దినమంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని అల్లాడి పోయారు. పోరాటాల కిల్లా సత్తా చూపింది, సొంత మనుషులే వెన్నుపోటు పొడుస్తున్నారని పొగిలి పొగిలి ఏడ్చింది. దేశ దేశాలనుండి మిత్రులు ఆవేదనతో టేలిఫోన్లలో మాట్లాడుతున్నారు. నేడు బిడ్డలు ఎందరో అహంకారపు తూటాలకు ఎదురోడ్డారు. ఏ రాజకీయ పార్టి కాదు, వీరు మాత్రమె జగన్ యాత్రని చివరికి ఆపగలిగారు. ఏమైతున్దిలే చూద్దాం అనుకొన్న వారికి చెప్పు దెబ్బ పడ్డట్టే! ఈ త్యాగాలే , ఈ పోరాట పటిమే లేక పొతే, ఈ మట్టిలో , ఈ గాలిలో , నర నరాన తెలంగానే లేకపోతె జగన్ యాత్ర సుఖంగా జరిగేది, శత్రువులు విజయోత్సాహంతో మరో యాత్రకి సన్నాహాలు చేసేవారు. ‘కొండ’చిలువలు విర్రవీగుతూ తెలంగాణని మరింత భ్రష్టు పట్టించే వాళ్ళు. ఇవాళ జగన్ ను వెనక్కి పంపించింది ప్రభుత్వమూ, హోం కాదు, మనకు ప్రభుత్వాలు లేవు, హోం శాఖా అంతకన్నా లేదు, ఒక వేళ ఉంటె, అయితే గీతే కేవలం అమాయక తెలంగాణా విద్యార్థుల పై, కార్య కర్తల పై కేసులు పెట్టటానికి , జైలు పాలు చేయటానికి మాత్రమె ఉన్నాయి . ఈరోజు ఏమైంది, చిట్టచివరికి గాయం ఇంకా సలుపుతనే ఉంది, ఎక్కడో ఒక కాష్టం మండుతూనే ఉంది, చూస్తుండగానే ప్రాణాలు గాలిలో కలవనే కలిసినయి.
తెలంగాణా, దగాకోరులకి ఎప్పటికి సింహ స్వప్నమే! ఇవాళ లగడపాటి దో రొద, జగను వెనుక రాజ్య కాంక్ష కధ, చిరంజీవి కి సోనియా రాయబారం, బాబు గారి రెండు కళ్ళ వ్యవహారం, కాంగ్రెస్ వాదుల గుట్టు చప్పుడు కాని రహస్య తెలంగాణా ప్రేమ వ్యవహారం, జగన్ ని ఏమి చేయలేక అధిష్టానం వ్యధ. తెలంగాణా రానీయ కుండ చేయటానికి ఒక్కొక్కళ్ళకి ఎన్ని తిప్పలో. తెలంగాణా తేటతెల్లన్గుంటది! కడుపునిండా మాట్లాడు తుంది! ఎవడు ఎన్ని వేషాలు వేసినా ఏదో ఒక రోజు పట్టుబడక మానడు. నేడు పార్టీల గురించి బెంగ లేదు, ఏ పార్టీ అజెండా ఏమిటో అని దిగులు అంతకన్నా లేదు..వాడెవడో, వీడెవడో అంతా తెలంగాణా కి సమజ్ అయింది. అంతా తోడు దొంగలే, దోపిడీ దొంగలందరూ ఒక్కటే. జగన్ కి అన్ని పార్టీల మద్దతు లభిస్తుంది. పార్టీలకు అతీతంగా దోచుకొను వాడికి అందరి సహాయ సహకారాలు ఉంటాయి మరి. చివరికి వారికి పార్టీలు అడ్డు రావు, కులాలు అడ్డు రావు, ఒకే మాట, బాట. తెలంగాణా ల లేనిదల్లా ఈ మోసకారి తనమే, అవతలి వాడిని దోచుకో రాదు, దోపిడీ చేయకుండా అడ్డుకో రాదు..ఏదో చాతనయిన కాడికి ఇంత వేనుకేసుకోవడం, దానికోసం జీవితాల్ని, ప్రాంతాల్నిఅవతలి వాడికి తాకట్టు పెట్టడం.
తెలంగాణాల దొరలకు ఊడిగం చేస్తారనే నానుడి ఉంది. దీనికి ఇక్కడి రెడ్డి మరి ఇతర పెద్ద కులాలు మినహాయింపు కాదు. వారు కూడా అసలైన సీమాంద్ర దొరల చెప్పు చేతల్లో ఉంటారు, వారి మోచేతి నీళ్ళు తాగుతూ ఉంటారు. అతివినయం కదా. దీనిని, అతి తెలివి అనుకోవాలో, తెలివి తక్కువ తనం అనుకోవాలో, చేతకాని తనం అనుకోవాలో, సిగ్గు లేనితనం అనుకోవాలో ఆంధ్ర చానల్ లో ఒపినియన్ పోల్ ద్వారా తెలుసు కుంటే కాని అర్థం కాదు.
చెన్నా రెడ్డి కాలం నుంచి కొండ దంపతులదాక మనకు అర్థం అయింది ఒకటే, తెలంగాణకి పెద్ద శత్రువు తెలంగాణాల ఉన్న దద్దమ్మలే , క్షమించండి, అనక తప్పడం లేదు, అడ్డుకోవాలని చూస్తుంది సీమ ఆంధ్ర వాళ్ళే అయినా వాళ్ళని మోస్తున్నది, తెలంగాణా వాళ్ళే. ఇవాళ మన వాళ్ళే జగన్ ని పిలిచినారు, ఈశ్వర్ రెడ్డి , కోమటి రెడ్డి తదితరులు ఘన స్వాగతం పలికారు, వెన్నంటి అండగా నిలిచారు. వీరు తెలంగాణా వాదులు! ఎన్ని శవాలు కుప్పలుగా పడినా, వారి వారి రాజకీయ లబ్ది కోసం తెలంగాణను తూకం వేసి అమ్ముతారు. వీరిని ఏమి చేయలేము మనం, కనీసం ప్రస్నిన్చాలేము. ఇవాళ పాల్ ప్రాణం తీసింది ఎవరు? జగనా లేక తెలంగాణా ప్రజా ప్రతినిధులా? అసలు జగన్ ని వరంగల్ రావడానికి, ఇంత హింస ప్రేరేపించడానికి మన వాళ్ళు కాదా కారణం? ఇంకా ప్రభుత్వం , సబితక్క, పోలీసులు, అని మనం ఎందుకు భ్రమలో ఉన్నాం? ఎన్ని ప్రాణాలు పోయినా మనకు అర్థం కాదా? ఉద్యమం ద్వారానే తెలంగాణా సాధ్యమని..కమిటీలని అడ్డం పెట్టుకొని పబ్బం గడుపుకుందామని కుట్రలు పన్నుతున్నారని ఇంకా తెలుసుకోలేదా మనం? ఎందుకు మనం ఈ కొండలని , బండలని ఇంక భరించాలి? మన చేతులతో మన ప్రాణాలు తీసుకోవదానికేన ? ఇవాళ సీమ ఆంధ్ర నాయకులకు పండగ కాదా, వాళ్ళు వాళ్ళే కొట్టుకొని చచ్చారని? పార్టీలు, ప్రతినిధులు , ఛీ! ఈ పేర్లు పలకడానికే అసహ్య పడే రోజులొచ్చాయి.
ఏమిటి మార్గం? నాయకుడు లేని ఉద్యమం నడుస్తుంది ఇక్కడ, ఇది ఫ్రెంచి ఉద్యమం అన్నారెవరో. ఇది ప్రజలందరి ఉద్యమం. ఒక్కో ప్రాణం పోతుంటే , కాపాడ లేని మన పరిస్తితికి మనమే భాద్యత వహించాలి. తెలంగాణా రాక పొవాడానికి ఎన్ని కారణాలు ఉన్నాయో, ఉద్యమం ముందుకు పడకుండా అడ్డు పడే శక్తులు కూడా అన్నే ఉన్నాయి. మనం ఇంకా కొంతమంది నాయకులని గుడ్డిగా నమ్మడం, కులాలుగా, వర్గాలుగా విడి పోవడం, పార్టీలుగా విడి పోవడం, ప్రజలకి ఒక నమ్మకాన్ని కలిగించ లేక పోవడం, కొన్ని కారణాలు.
ఇవాళ మనమందరం కేవలం ప్రజలతో ఉండి, పార్టీలకు అతీతంగా ఉద్యమాల్ని నడిపించే చారిత్రకావసరం ఏర్పడింది. నాలుగు కోట్ల ఆశలు ముందుకు పోవాలంటే, ఒక్కటే కులం, మతం, ప్రాంతం, పార్టి ..అది తెలంగాణా కావాలి. రాజకీయాలు నడిపించాల్సిన భాద్యత కూడా మనదే. ప్రజా బలం ముందు, ఏ ఎత్తుగడలు పనికి రావు. ఎన్నికలు వచ్చినపుడు మాత్రం మనం మనకొరకు వచ్చే పార్టీలకు మద్దతు తెలుపుదాం. ఏదైనా ఒక కార్య క్రమాన్ని అందరం తీసుకుని ముందుకు పోదాం. అది సహాయ నిరాకరనే కావొచ్చు, నిరవధిక బందులు , ధర్నాలు కావచ్చు, నిరసనలు కావొచ్చు, సీమ ఆంధ్ర గుండెల్లో నిద్ర పోవాలంటే వారి వారి వ్యాపారాలకి, కార్య కలాపాలకి అడ్డు పడడం ఒకటే మార్గం.
ఏదో ఒకటి చేద్దాం! ఇంకా కొన్ని ప్రాణాలనైనా కాపాడుకుందాం. ఉవ్వెత్తున ఎగసిపడుతున్న ఉద్యమాన్ని కాపాడుకుందాం. నేను సైతం అంటూ జంగ్ కు సిద్ధం అవుదాం. తెలంగాణాల పుట్టి, ఈ మట్టికి మచ్చ తెస్తున్న దగా కోరులను తరిమి తరిమి కొడదాం, లేదా కాలోజి చెప్పినట్టు ‘ప్రాణంతోనే పాతరేద్దాం ‘.
జై తెలంగాణా!
సుజాత సూరేపల్లి
–